జయశంకర్ ఆశయాలే తెలంగాణకు దిక్సూచి
ఆశయ సాధనే ఆయనకు నిజమైన నివాళి: మాజీ మున్సిపల్ చైర్మన్లు
మెదక్, ఆంధ్రప్రభ: తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంత బలాన్ని అందించి, రాష్ట్ర సాధన కోసం జీవితాంతం అంకితభావంతో కృషి చేసిన ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని మాజీ మున్సిపల్ చైర్మన్లు ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్, బట్టి జగపతి పిలుపునిచ్చారు.
ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా గురువారం మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్లు ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్, బట్టి జగపతి, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంత దిశానిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి జయశంకర్ సార్ అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్నే అంకితం చేసి, ఉద్యమానికి చివరి శ్వాస వరకు అండగా నిలిచారని పేర్కొన్నారు. ఉద్యమ నిర్మాణంలో కేసీఆర్‌కు వెన్నంటి నిలిచి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ భూపాలపల్లి జిల్లాకు, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి జయశంకర్ సార్ పేరు పెట్టడంతో పాటు, ఆయన జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించేలా నిర్ణయం తీసుకోవడం ఆయనపై ఉన్న గౌరవానికి నిదర్శనమని అన్నారు.
జయశంకర్ సార్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ సేవలో ముందుకు సాగడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు దీపక్ జుబేర్, అహ్మద్, దీపక్ కుమార్, నాయకులు కృష్ణ గౌడ్, ప్రభు రెడ్డి, కేవల్, జగదీష్ మోచి, కిషన్, సాదిక్, ఇందాద్, లక్ష్మణ్, ఇస్మాయిల్, సాయి, కిరణ్, శీను నాయక్, రంజిత్ నాయక్, ఎంబిపూర్ మహేష్, రవి, వేణు తదితరులు పాల్గొన్నారు.
