వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు
- ఓ పక్క ఆక్రమణలు, మరోపక్క రోడ్డుపైనే గోవులు
- ట్రాఫిక్ సమస్యతో ప్రజల అవస్థలు
మైలవరం, ఆంధ్రప్రభ: మైలవరం పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ జఠిలంగా మారుతోంది. ప్రధాన రహదారి, పోస్టాఫీస్ రోడ్డు, కూరగాయల మార్కెట్ రోడ్డు, నూజివీడు రోడ్డులో తరచూ ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రద్దీ సమయాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారి వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పార్కింగ్ కు స్థలం వదలకుండా ఆక్రమణలతో కుంచించుకుపోతున్న రహదారులు రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీలను దాటి చేపడుతున్న నిర్మాణాలు, రహదారులపై కొనసాగుతున్న తోపుడు బండ్ల వ్యాపారాలు ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. పాదచారులు నడిచేందుకు సరైన స్థలం లేకపోవడంతో వారు రహదారిపైనే నడవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వాహనాల రాకపోకలకు మరింత ఆటంకం ఏర్పడుతోంది.
అక్రమ ఆక్రమణలను తొలగించాలని గ్రామ పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ, కొందరు వాటిని పట్టించుకోకపోవడం అధికారుల ఆదేశాల అమలుపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. నోటీసులు ఇచ్చి నెలలు గడుస్తున్నా ఆక్రమణలు తొలగించకపోవడంతో సమస్య మరింత ముదురుతోంది.

జాయింట్ సర్వే చేసినా… చర్యలు శూన్యం
మైలవరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పంచాయతీ, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, పోలీసు శాఖల అధికారులు ఇటీవల సంయుక్తంగా సర్వే నిర్వహించారు. అయితే సర్వే అనంతరం సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు వేగంగా చేపట్టకపోవడంతో అది కేవలం మొక్కుబడి కార్యక్రమంగానే మిగిలిపోయిందని స్థానికులు విమర్శిస్తున్నారు.
రోడ్డుపైనే గోవులు.. నిత్యం ఇబ్బందులు..
ఇదిలా ఉంటే పట్టణంలోని ప్రధాన రహదారులు, ఇతర రోడ్లపై పగలు, రాత్రి తేడా లేకుండా గోవులు సంచరిస్తూ, రోడ్లపైనే నిలిచిపోతుండటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఒక్కసారిగా గోవులు రోడ్డుపైకి రావడంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, కార్ల డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రద్దీ సమయాల్లో గోవుల కారణంగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ మరింత పెరుగుతోంది. గోవులను రోడ్లపైకి వదలకుండా చూడాలని పంచాయతీ అధికారులు వాటి యజమానులకు నోటీసులు ఇచ్చినప్పటికీ, పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు.

ప్రమాదం జరిగే వరకు పట్టించుకోరా?
ట్రాఫిక్ రద్దీ, రహదారి ఆక్రమణలు, రోడ్డుపై గోవుల సంచారం కలిసిపోవడంతో మైలవరంలో ప్రమాదాల ముప్పు పెరుగుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు సైతం రద్దీ ప్రాంతాలను దాటేందుకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
ట్రాఫిక్ సమస్యపై సంబంధిత శాఖలు సమన్వయంతో శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. రహదారి ఆక్రమణలను వెంటనే తొలగించడం, తోపుడు బండ్లకు క్రమబద్ధమైన స్థలాన్ని కేటాయించడం, రోడ్డుపై తిరిగే గోవుల విషయంలో యజమానులపై చర్యలు తీసుకోవడం, రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మైలవరం ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతారా? లేక మరోసారి సర్వేలు, నోటీసులతోనే సరిపెడతారా? అన్నది వేచి చూడాల్సిందే.
