పెద్దూర్ లో అంగన్వాడి బాట ర్యాలీ..

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని పెద్దూర్ గ్రామపంచాయతీ పరిధిలో గల అంగన్‌వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో శనివారం “అమ్మ మాట–అంగన్‌వాడీ బాట” కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లు గ్రామంలోని పలు వీధుల గుండా అవగాహన ర్యాలీ నిర్వహించారు. గ్రామస్తులు, తల్లిదండ్రులకు అంగన్‌వాడీ కేంద్రాల ప్రాధాన్యతను వివరిస్తూ చిన్నారి పిల్లలను క్రమం తప్పకుండా కేంద్రాలకు పంపించాలని కోరారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న కోడిగుడ్లు, పౌష్టికాహారం, ఆరోగ్యలక్ష్మి భోజనం తదితర సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. అలాగే చిన్నారులకు ఆటలు, పాటల ద్వారా నాణ్యమైన ప్రాథమిక విద్యతో పాటు మానసిక, శారీరక వికాసానికి అవసరమైన శిక్షణ అందిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు జాడి రాజేశ్వరి, ఎన్. జ్యోతి, రేఖ, కరుణ, సుగుణ, ఆయా కేంద్రాల హెల్పర్లు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
