IPL2027 | వచ్చే సీజన్‌ను కాస్త ముందుగా..!

IPL2027 | వచ్చే సీజన్‌ను కాస్త ముందుగా..!

  • నిర్వ‌హించాల‌ని బీసీసీఐ యోచన
  • మార్చి 10 నుంచి మే 15 వరకు టోర్నీకి ప్రాథమిక ప్రణాళిక

IPL2027 | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 లీగ్ ఐపీఎల్ షెడ్యూల్‌లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న ఎండల తీవ్రత, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 2027 ఐపీఎల్ సీజన్‌ను సాధారణం కంటే ముందుగానే ముగించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించిన వివరాల ప్రకారం.. 2027 ఐపీఎల్‌ను మార్చి 10న ప్రారంభించి మే 15న ముగించేలా ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. ఈ అంశంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌తో ఇప్పటికే చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు.

మే రెండోార్ధం నుంచి దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పాటు, కొన్ని రాష్ట్రాల్లో ముందస్తు వర్షాలు కూడా మ్యాచ్‌ల నిర్వహణకు ఆటంకంగా మారే అవకాశం ఉంది. ఆటగాళ్ల ఆరోగ్యం, ప్రేక్షకుల సౌకర్యం, మ్యాచ్‌ల సజావు నిర్వహణను దృష్టిలో ఉంచుకుని షెడ్యూల్‌లో మార్పులు చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, ఐపీఎల్‌లో మ్యాచ్‌ల సంఖ్యను 74 నుంచి 94కు పెంచే ప్రతిపాదనలపై కూడా గత కొంతకాలంగా చర్చ సాగుతోంది. అయితే అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్, ద్వైపాక్షిక సిరీస్‌ల షెడ్యూల్ కారణంగా ప్రస్తుతం ఆ ప్రతిపాదన అమలు సాధ్యపడలేదని సమాచారం. దీంతో 2027 సీజన్‌లోనూ గత సీజన్‌ల మాదిరిగానే మొత్తం 74 మ్యాచ్‌లు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.

కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్ మార్చి 28న ప్రారంభమై మే 31 వరకు కొనసాగింది. 2027 సీజన్‌కు సంబంధించి తుది షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన రానున్న రోజుల్లో వెలువడే అవకాశం ఉంది.