INDvsADG-ODI | 6:00 దాటితే మ్యాచ్ రద్దే.. అభిమానుల్లో టెన్షన్ !!

INDvsADG-ODI | 6:00 దాటితే మ్యాచ్ రద్దే.. అభిమానుల్లో టెన్షన్ !!

ఆంధ్రప్రభ : భారత్-ఆఫ్ఘానిస్థాన్ (INDvsADG-ODI) మధ్య నేడు (శనివారం) జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. దాదాపు ఆరు నెలల విరామం తర్వాత భారత గడ్డపై వన్డే క్రికెట్ తిరిగి ప్రారంభం కావడంతో అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూశారు. అయితే ధర్మశాలలో శుక్రవారం రాత్రి నుంచే కురుస్తున్న వర్షం మ్యాచ్ నిర్వహణపై అనుమానాలు రేకెత్తిస్తోంది. మ్యాచ్ ప్రారంభానికి ముందే మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పివేయాల్సి రావడంతో టాస్ కూడా ఆలస్యమైంది. మరికొన్ని గంటల పాటు వర్షం కొనసాగే అవకాశం ఉంద‌ని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అభిమానుల్లో నిరాశ నెలకొంది.

ఓవర్ల కోత ఖాయం..

మధ్యాహ్నం 2 గంటల తర్వాత నుంచి ఓవర్ల కోత ప్రారంభమైనట్లు తెలుస్తోంది. వర్షం ఆగినా మ్యాచ్ పూర్తి 50 ఓవర్లతో జరిగే అవకాశం లేదని నిర్వాహక వర్గాలు భావిస్తున్నాయి. పరిస్థితులు అనుకూలిస్తే కుదించిన ఓవర్ల మ్యాచ్ నిర్వహించే అవకాశముంది. భారత్-ఆఫ్ఘాన్ తొలి వన్డే నిర్వహణకు సాయంత్రం 6:32 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. ఆ సమయానికి ఆట ప్రారంభం కాకపోతే మ్యాచ్‌ను అధికారికంగా రద్దు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మైదానంలో సూపర్ సాపర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ వర్షం ఆగితేనే డ్రైనేజీ వ్యవస్థ పనిచేసే పరిస్థితి ఉంది.

ప్రపంచకప్ సన్నాహకాల్లో కీలక సిరీస్…

2027 వన్డే ప్రపంచకప్ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాల్లో జరగనుంది. ఆ మెగా టోర్నీకి ముందు భారత జట్టుకు ఈ సిరీస్ ఎంతో కీలకం. ఐపీఎల్ అనంతరం వన్డే ఫార్మాట్‌లో ఆటగాళ్లు తిరిగి ఫామ్ అందుకునేందుకు, బెంచ్ బలాన్ని పరీక్షించేందుకు ఆఫ్ఘానిస్థాన్ సిరీస్‌ను కీలక అవకాశంగా భావిస్తుంది బీసీసీఐ. అయితే ధర్మశాలలో వర్షం కారణంగా తొలి మ్యాచ్ రద్దయితే భారత జట్టు సన్నాహకాలకు స్వల్ప అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

INDvsAFG Rain Threat | అఫ్గాన్‌తో ఇండియా మ్యాచ్‌కు వ‌ర్షం అడ్డంకి