సోలార్ రంగంలో యువతకు బంగారు అవకాశాలు

సోలార్ రంగంలో యువతకు బంగారు అవకాశాలు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో సౌర విద్యుత్ పెంపే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకాన్ని ప్రతి ఇంటికి అమలు చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తోంది. ఈ పథకం కోసం భారీగా సబ్సిడీలు అందజేస్తోంది.

ఈ నేపథ్యంలో సోలార్ ప్యానెల్లు అమర్చడం, నిర్వహణ కోసం యువతకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు కేంద్రాలను ఎంపిక చేసి ప్యానెళ్ల నిర్వహణపై ట్రైనింగ్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. కాకినాడ కేంద్రంలో సోమవారం నుంచి 9 రోజుల పాటు ఈ శిక్షణ ఇచ్చేందుకు యువతను ఎంపిక చేసింది.

చదువుతో సంబంధం లేకుండా ఆసక్తి ఉన్న యువతకు సోలార్ ఎంటర్‌ప్రెన్యూర్షిప్ కార్యక్రమం కింద శిక్షణ ఇచ్చి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం సోలార్ విద్యుత్తుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యం ఇస్తుండడంతో వీటి వినియోగం కూడా క్రమంగా పెరుగుతోంది.

అయితే, వీటి నిర్వహణకు అవసరమైన మానవ వనరుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్యానెల్లు అమర్చేందుకు అవసరమైన సాంకేతిక నిపుణులు తక్కువగా ఉండడంతో లబ్ధిదారులకు నిరీక్షణలు తప్పడం లేదు. అంతేకాకుండా ఎస్సీ లబ్ధిదారులకు ప్రభుత్వమే సోలార్ ప్యానెళ్లను ఉచితంగా అందజేస్తుండటంతో వినియోగం పెరిగింది. దీంతో ఈ రంగంలో నైపుణ్యం ఉన్న వారికి డిమాండ్ పెరిగింది.

ఇందులో భాగంగా నిరుద్యోగ యువతకు ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను అమర్చడం, నిర్వహణకు సంబంధించి ఉచితంగా శిక్షణ ఇవ్వడంతోపాటు వారిని వ్యాపారవేత్తలుగా తయారు చేయడానికి ప్రత్యేక కార్యక్రమంను రూపొందించింది. పీఎం సూర్యఘర్ మస్త్ బిజిలీ యోజనలో భాగంగా సోలార్ ఎంటర్‌ప్రెన్యూర్షిప్ పేరుతో యువతను ప్రోత్సహిస్తున్నారు. శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు కూడా అందజేస్తామని అధికారులు తెలిపారు.

ఇప్పటికే పలు పాలిటెక్నిక్ కళాశాలలను ఎంపిక చేసి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 18 ఏళ్లు నిండిన యువతీయువకులు దరఖాస్తు చేసుకోవచ్చని, ఎలాంటి విద్యార్హత లేకపోయినా నేర్చుకోవాలన్న తపన, సోలార్ రంగంలో ఎదగాలన్న లక్ష్యం ఉంటే సరిపోతుందని అధికారులు సూచిస్తున్నారు.

ఒక్కో బ్యాచ్‌కు 30 మంది చొప్పున ఎంపిక చేసి, ఇతర ప్రాంతాల అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. 9 రోజుల పాటు అనుభవజ్ఞులైన నిపుణులతో సోలార్ ప్యానెళ్ల నిర్వహణ తదితర అంశాలపై సమగ్రంగా శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.