పరామర్శల పేరుతో పాదయాత్ర గారడీకి తెర

  • జగన్‌ పై ఎమ్మెల్యే బడేటి చంటి ఫైర్‌

ఏలూరు, ఆంధ్రప్రభ: రాష్ట్రాన్ని గత వైసీపీ ప్రభుత్వం సృష్టించిన అగాధం నుంచి అభివృద్ధి దిశగా తీసుకెళ్తోన్న ఘనత కూటమి ప్రభుత్వాధినేతలకే దక్కుతోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి దక్కుతోన్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి పరామర్శల పేరుతో పాదయాత్ర గారడీలకు తెరతీశారంటూ ఎమ్మెల్యే ధ్వజమెత్తారు.

ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ.. గత రెండేళ్ళ కాలంలో కూటమి ప్రభుత్వం చేతల్లో చేసి చూపించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, అందుకు అయిన ఖర్చును ప్రోగ్రెస్‌ రిపోర్టు పేరుతో సీఎం చంద్రబాబు విడుదల చేసిన వివరాలను తెలిపారు. ఇదేసమయంలో వైసీపీ అరాచక విధానాలపై తనదైన శైలిలో ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు.

కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్ళ కాలంలోనే సంక్షేమానికి రూ. 1.49 లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు. అలాగే అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం 1.34 లక్షల కోట్ల రూపాయలు వ్యయాన్ని పెట్టినట్లు ఆయన వెల్లడించారు. ఇక గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిలిచిపోయిన రుణాల రీ-షెడ్యూల్‌తో రూ. 8వేల, 269 కోట్లు ఆదాచేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మరోపక్క ఉద్యోగుల బకాయిల నిమిత్తం 30వేల, 849 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు చెప్పారు.

ఇక గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన బిల్లులు రూ. 19వేల, 357 కోట్లు చెల్లించామని ఎమ్మెల్యే తెలిపారు. 2014 నుంచి 19 వరకూ జీఎస్‌డీపీ వృద్ధి రేటు 13.5శాతం ఉంటే, వైసీపీ ప్రభుత్వ సమయంలో 10.30శాతం ఉందన్నారు. ఈ రెండేళ్ళలో జీఎస్‌డీపీ పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ వస్తోందన్నారు. ఇదంతా కూటమి ప్రభుత్వాధినేతలు ఎంతో దార్శనికతతో అమలు చేసిన ఆర్ధిక క్రమశిక్షణతోనే సాథ్యమైందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రజా ధనాన్ని ప్రజల కోసమే వినియోగించే బాధ్యతాయుతమైన పాలనకు ఇదే నిదర్శనమని ఆయన కితాబిచ్చారు.

ఇక వివిధ సామాజిక వర్గాల సంక్షేమం కోసం దాదాపుగా రూ. 1.49 లక్షల కోట్లు వెచ్చించామన్నారు. ఒకపక్క సంపూర్ణ సంక్షేమం, ఇంకోపక్క పరిపూర్ణమైన అభివృద్ధి కార్యక్రమాలను ఏకకాలంలో శరవేగంగా పరుగులు పెట్టిస్తోన్న కూటమి ప్రభుత్వ ఘనతను చూసి ఓర్వలేకే వైసీపీ నాయకులు బురద జల్లే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారంటూ ఆయన ధ్వజమెత్తారు. విధ్వంసం చేయాలని చూసే వారిని ఉక్కుపాదంతో అణచివేస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన హెచ్చరికను ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి గుర్తుచేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తొలుత చేనేత కార్మికులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్‌ మామిళ్ళపల్లి పార్థసారధి, ఈడా చైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌ పాల్గొన్నారు.