Child Safety 2030 | యాక్షన్ ప్లాన్‌కు శ్రీకారం

Child Safety 2030 | యాక్షన్ ప్లాన్‌కు శ్రీకారం
Child Safety 2030 | పిల్లల రోడ్డు భద్రతపై రాష్ట్ర స్థాయి చర్చలు
రోడ్డు ప్రమాదాల్లో పెరుగుతున్న చిన్నారుల మరణాలు
సమగ్ర భద్రతా ప్రణాళికపై ప్రభుత్వ దృష్టి
రోడ్డు భద్రతలో తెలంగాణను ముందంజలో నిలిపే లక్ష్యం
Child Safety 2030 | హైదరాబాద్, ఆంధ్రప్రభ : పిల్లలు, యుక్తవయస్కులను రోడ్డు ప్రమాదాల నుంచి రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రవాణా శాఖ ఆధ్వర్యంలో ‘రోడ్ సేఫ్టీ యాక్షన్ ప్లాన్ ఫర్ చిల్డ్రన్ 2030’పై తొలి రాష్ట్ర స్థాయి సంప్రదింపుల సమావేశం బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించారు.
బాలల కేంద్రిత రోడ్డు భద్రత కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమం దేశంలోనే తొలి ప్రయత్నాలలో ఒకటిగా నిలిచింది. ఈ సమావేశానికి రాష్ట్ర రవాణా కమిషనర్ కె. ఇలంబర్తి అధ్యక్షత వహించారు. పీహెచ్ఎఫ్ఎస్‌ఐ – ఐపీహెచ్ఎస్ డీమ్డ్ యూనివర్సిటీ, యూనిసెఫ్ సంయుక్త సహకారంతో నిర్వహించిన ఈ సదస్సులో రవాణా, పోలీస్, విద్య, వైద్య ఆరోగ్య, మున్సిపల్ పరిపాలన, ఆర్అండ్‌బీ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, ఎన్‌హెచ్‌ఏఐ, విద్యా సంస్థల ప్రతినిధులు పాల్గొని సుదీర్ఘంగా చర్చించారు.
ప్రస్తుతం పిల్లలు, యువతలో మరణాలు, వైకల్యానికి రోడ్డు ప్రమాదాలే ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (మోర్త్) గణాంకాల ప్రకారం, 2023లో దేశవ్యాప్తంగా దాదాపు 10,000 మంది పిల్లలు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణలో 2024లో నమోదైన 7,281 రోడ్డు ప్రమాద మరణాల్లో వందలాది మంది చిన్నపిల్లలు ఉండటం ఆందోళన కలిగిస్తోందని నిపుణులు పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి రోడ్డు భద్రత దశాబ్ద కార్యాచరణ లక్ష్యాల ప్రకారం రోడ్డు ప్రమాద మరణాలు, గాయాలను 50 శాతం తగ్గించడమే ఈ కార్యాచరణ ముఖ్య ఉద్దేశంమని వివరించారు.
పిల్లల భద్రతే సమాజ భద్రత
కార్యక్రమ ప్రాధాన్యతను వివరిస్తూ రవాణా కమిషనర్ కె. ఇలంబర్తి మాట్లాడుతూ.. పిల్లలను దృష్టిలో ఉంచుకొని భద్రతా వ్యవస్థలను నిర్మిస్తే, సమాజమంతటికీ భద్రతను నిర్మించినట్లేనని.. ఒక చిన్నారికి సురక్షితమైన రహదారి ప్రతి పౌరుడికి సురక్షితమని అన్నారు. రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ, గిరిజన ప్రాంతాల వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా సంబంధిత శాఖలతో నిరంతర సంప్రదింపుల ద్వారా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని, రోడ్డు భద్రత పరిపాలనలో తెలంగాణను దేశంలోనే ముందంజలో నిలిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.
యూనిసెఫ్ ప్రతినిధి డా. జెలలెం బి. టాఫెస్సే, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) డి. జోయెల్ డేవిస్, యూనిసెఫ్ హెల్త్ స్పెషలిస్ట్ డా. శ్రీధర్ ర్యావంకి, పీహెచ్ఎఫ్ఎస్‌ఐ – ఐపీహెచ్ఎస్ వైస్ ఛాన్సలర్ డా. ఎం.వి. విష్ణువర్ధన్ రావు, రవాణా శాఖ సంయుక్త కమిషనర్లు రమేష్, చంద్రశేఖర్ గౌడ్, శివలింగయ్య, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
