ఇంద్రకీలాద్రిపై అగ్నిమాపక మాక్ డ్రిల్..

ఇంద్రకీలాద్రిపై అగ్నిమాపక మాక్ డ్రిల్..
భద్రతపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఫైర్ సేఫ్టీ ఆడిట్లో భాగంగా అగ్ని ప్రమాద నివారణపై ప్రత్యేక మాక్ డ్రిల్ నిర్వహించారు.
దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. జిల్లా సహాయక అగ్నిమాపక అధికారి సూర్య ప్రకాశరావు ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించగా, దేవస్థానం సిబ్బంది, భద్రతా సిబ్బందికి అవగాహన కల్పించారు.
అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా చర్యలపై ప్రాక్టికల్ డెమో నిర్వహించారు. అగ్నిమాపక పరికరాల వినియోగం, అత్యవసర పరిస్థితుల్లో భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధానం, అగ్ని వ్యాప్తిని నియంత్రించే పద్ధతులను వివరించారు.
ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిబ్బందిని సిద్ధం చేయడమే ఈ మాక్ డ్రిల్ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
