ఇంద్రకీలాద్రిపై కొండచిలువ కలకలం

ఇంద్రకీలాద్రిపై కొండచిలువ కలకలం

భయంతో పరుగులు తీసిన భక్తులు..

కొంతసేపు నిలిచిపోయిన మెట్ల మార్గ రాకపోకలు

విజయవాడ, ఆంధ్రప్రభ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న Sri Durga Malleswara Swamy Varla Devasthanamలో బుధవారం కలకలం చోటుచేసుకుంది. మెట్ల పూజ ప్రాంగణంలోని వినాయకుడి గుడి సమీపంలో చెట్టుపై నుంచి ఓ భారీ కొండచిలువ ఒక్కసారిగా కిందపడటంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు.

చెట్టుపై ఉడతను వేటాడుతున్న సమయంలో కొండచిలువ అదుపుతప్పి కిందపడినట్లు అక్కడున్న భక్తులు తెలిపారు. అకస్మాత్తుగా భారీ పాము కిందపడటంతో మెట్ల మార్గంలో వెళ్తున్న భక్తులు భయంతో పరుగులు తీశారు. కొందరు చిన్నపిల్లలను ఎత్తుకుని అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు.

ఈ ఘటనతో కొంతసేపు మెట్ల మార్గంలో భక్తుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆలయ సిబ్బంది, భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ఘటనపై సమాచారం అందుకున్న సిబ్బంది కొండచిలువను అటవీశాఖ అధికారులకు అప్పగించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఇటీవల ఇంద్రకీలాద్రిపై ఓ కుక్క భక్తుడిని కాటేయగా, తాజాగా పాముల సంచారం భక్తుల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది.