పబ్లిక్ టాయిలెట్స్ ను కమ్మేశారు..
పబ్లిక్ టాయిలెట్స్ ను కమ్మేశారు..
- అడ్డంగా చిరు వ్యాపారం
పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని ప్రధాన రోడ్డు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధాన గేటు సమీపంలోని పబ్లిక్ టాయిలెట్స్ ప్రజలకు కనిపించకుండా చిరు వ్యాపారి అడ్డంగా స్టాండ్లను పెట్టి కమ్మేసిన పరిస్థితి ఏర్పడింది. పరకాల పట్టణానికి చుట్టూ గ్రామాలతో పాటు వివిధ ప్రాంతాల నుండి ప్రజలు వ్యక్తిగత అవసరాలకు పరకాల కు రావడం జరుగుతుంది. అత్యవసరంగా మల మూత్ర విసర్జన కోసం పట్టణానికి వచ్చిన ప్రజలకు ఇబ్బందులు కలవకుండా గతంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధాన గేటు సమీపంలో ప్రజలు వినియోగించుకునే విధంగా పబ్లిక్ టాయిలెట్స్ రూములను నిర్మాణం చేయడం జరిగింది.
ఇటీవల కాలంలో పబ్లిక్ టాయిలెట్ రూమ్ లు కనిపించకుండా ఇనుప స్టాండ్లపై బట్టలు ఏర్పాటు చేసి చిరు వ్యాపారం నిర్వహిస్తున్నారు. దీంతో అత్యవసరంగా మలమూత్ర విసర్జనకు వెళ్లే ప్రజలకు పబ్లిక్ టాయిలెట్ రూమ్ లు కనిపించకపోవడంతో విసర్జన కోసం ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇబ్బందులకు గురవుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ శాఖ అధికారులు స్పందించి ప్రజల కోసం ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్స్ రూములు ప్రజలకు కనిపించే విధంగా అడ్డంగా ఏర్పాటు చేసిన వ్యాపార స్టాండులను తొలగించి దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు పబ్లిక్ టాయిలెట్స్ ను వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
