మున్నిపల్ ఎన్నికలకు కీలక నోటిఫికేషన్
- వార్డుల వారీ ఓటర్ల జాబితాలకు ముహూర్తం
అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి వార్డుల వారీగా ఫోటోతో కూడిన ఓటర్ల జాబితాలను సెప్టెంబర్ 3న ప్రచురించనున్నట్లు కమిషన్ ప్రకటించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం (ఆగస్టు 12న) విడుదల చేసింది.

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఓటర్ల జాబితాల తయారీతో పాటు మేయర్, వార్డు సభ్యుల స్థానాల రిజర్వేషన్ల ఖరారుకు ఈ జాబితాలు ప్రాతిపదికగా ఉపయోగపడనున్నాయి. తాజా అసెంబ్లీ ఓటర్ల జాబితాల ఆధారంగా మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితాలను సిద్ధం చేయనున్నారు. ఇందుకు 2026 జనవరి 1వ తేదీని అర్హత తేదీగా పరిగణించనున్నారు.
తమ పరిధిలోని కార్పొరేషన్లకు సంబంధించి వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను రూపొందించి ప్రచురించే బాధ్యతను రాష్ట్ర ఎన్నికల సంఘం సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు అప్పగించింది. అయితే, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) పరిధిలో మాత్రం ఈ బాధ్యతలను ఆయా జోన్ల కమిషనర్లకు అప్పగించారు. ఓటర్ల జాబితాల తయారీ, ప్రచురణకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు కమిషన్ ప్రకటించింది.
