గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం కూటమి ప్రభుత్వ లక్ష్యం
రాఘవాపురంలో రూ.36 లక్షలతో నూతన విలేజ్ వెల్నెస్ హెల్త్ సెంటర్ ప్రారంభం
నందిగామ రూరల్, ఆంధ్రప్రభ: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. మండల పరిధిలోని రాఘవాపురం గ్రామంలో రూ.36 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన విలేజ్ వెల్నెస్ హెల్త్ సెంటర్ భవనాన్ని బుధవారం ఆమె కూటమి నాయకులు, అధికారులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. గతంలో చిన్నపాటి అనారోగ్య సమస్యలకు కూడా గ్రామీణ ప్రజలు పట్టణ ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని తెలిపారు. ఆ ఇబ్బందులను తొలగించి వైద్య సేవలను గ్రామస్థాయిలోనే అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు.
విలేజ్ వెల్నెస్ హెల్త్ సెంటర్ల ద్వారా గ్రామాల్లోనే ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ఈ కేంద్రాల లక్ష్యమన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ హెల్త్ సెంటర్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.
ప్రజారోగ్యానికి ప్రాధాన్యం..
ప్రజారోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే సౌమ్య అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య మౌలిక వసతులను బలోపేతం చేస్తూ, ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. రాఘవాపురం గ్రామానికి నూతన హెల్త్ సెంటర్ అందుబాటులోకి రావడం సంతోషకరమైన విషయమని, ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామీణ ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైద్య సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.
