దుబాయి నిర్బంధ కేంద్రం నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు విముక్తి
దుబాయి నిర్బంధ కేంద్రం నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు విముక్తి
- సీఎం ప్రవాసి ప్రజావాణి చొరవతో స్వదేశానికి అభిషేక్ రాక
అచ్చంపేట, ఆంధ్రప్రభ: దుబాయిలో డిపోర్టేషన్ సెంటర్ (నిర్బంధ కేంద్రం)లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రంగారెడ్డి జిల్లా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అభిషేక్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో క్షేమంగా స్వదేశానికి రప్పించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సీఎం ప్రవాసి ప్రజావాణి ఇన్‌చార్జ్ డాక్టర్ జి. చిన్నారెడ్డి తీసుకున్న ప్రత్యేక చర్యలతో హైదరాబాద్ ఓల్డ్ ఆల్వాల్‌కు చెందిన అభిషేక్ స్వదేశానికి చేరుకున్నాడు.
కష్టకాలంలో తనకు అండగా నిలిచి సురక్షితంగా స్వదేశానికి చేరుకునేలా సహకరించిన సీఎం ప్రవాసి ప్రజావాణి సేవలను అభిషేక్ గుర్తుచేసుకున్నాడు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో డా. జి. చిన్నారెడ్డి, సీఎం ప్రవాసి ప్రజావాణి రాష్ట్ర కోఆర్డినేటర్ బొజ్జ అమరేందర్ రెడ్డి, ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ ఎం. భీమ్ రెడ్డిలను శాలువాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా డా. జి. చిన్నారెడ్డి మాట్లాడుతూ.. విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు ప్రజలకు సీఎం ప్రవాసి ప్రజావాణి ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని తెలిపారు. సమస్యలు ఎదురైన ప్రతి ప్రవాస భారతీయుడికి తక్షణ సహాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
