Ebola virus alert | ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై కేంద్రం హెచ్చరిక

Ebola virus alert | ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై కేంద్రం హెచ్చరిక
Ebola virus alert | విమానాశ్రయాల్లో కఠిన ఆరోగ్య తనిఖీలు
ఎబోలా వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తం
ప్రత్యేక వ్యాక్సిన్ లేకపోవడంతో పెరుగుతున్న ఆందోళనలు
భారత్‌లో కేసులు లేవు.. అయినా అప్రమత్తంగా ఉండాలని సూచన
Ebola virus alert | న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రతినిధి : ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఆఫ్రికా దేశాల్లో వైరస్ వేగంగా వ్యాపిస్తున్న కారణంగా భారత పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ దేశాలకు అత్యవసరమైతేనే తప్ప ప్రయాణాలు చేయవద్దని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది.
ఒక వేళ ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎవరైనా ఉంటే, వారు విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ కంటే ముందే హెల్త్ డెస్క్ వద్ద రిపోర్ట్ చేయడం తప్పనిసరని ఇదివరకే స్పష్టం చేసింది. మరోవైపు, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇటీవల ఎబోలా వ్యాప్తిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. అదే సమయంలో ఆఫ్రికా సీడీసీ కూడా కాంగో, ఉగాండాలో వ్యాపిస్తున్న ఎబోలా వైరస్ పరిస్థితిని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ కాంటినెంటల్ సెక్యూరిటీగా గుర్తించింది.
కేంద్ర సూచనల ప్రకారం, భారత పౌరులు అత్యవసరం కాని పర్యటనలను వాయిదా వేసుకోవాలని, ప్రస్తుతం ఆ దేశాల్లో నివసిస్తున్న లేదా అక్కడికి వెళ్లిన భారతీయులు స్థానిక ప్రభుత్వాల ఆరోగ్య మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించింది. వ్యక్తిగత పరిశుభ్రత, రక్షణ చర్యల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అలాగే, విదేశీ ప్రయాణికులపై ఎయిర్‌పోర్టులలో ఆరోగ్య తనిఖీలు కఠినతరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవసరమైతే ప్రత్యేక స్క్రీనింగ్ చర్యలు చేపట్టేందుకు కేంద్ర సర్కారు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
మరోవైపు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర కమిటీ మే 22న సభ్య దేశాలకు తాత్కాలిక మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా విమానాశ్రయాలు, సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిఘా పెంచాలని సూచించింది. కాంగో, ఉగాండా ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో జ్వరం లేదా అనుమానాస్పద లక్షణాలు ఉంటే వెంటనే గుర్తించి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. అలాగే వైరస్ గుర్తించిన ప్రాంతాలకు ప్రయాణాలను తగ్గించాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది.
కాంగో, ఉగాండా సరిహద్దు దేశాలు కూడా ప్రమాదంలో ఉన్నాయని అంచనా వేస్తున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. సౌత్ సూడాన్ దేశానికి వ్యాధి వ్యాప్తి ముప్పు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. ఎబోలా ఒక తీవ్రమైన వైరల్ హీమరేజిక్ ఫీవర్ అని, ఇది బుండిబుగ్యో వైరస్ స్ట్రెయిన్ వల్ల వ్యాపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఈ వ్యాధి సోకిన వారిలో మరణాల శాతం అధికంగా ఉండే అవకాశం ఉందంటున్నారు. అయితే, ఈ స్ట్రెయిన్‌కు ప్రత్యేక వ్యాక్సిన్ లేదా కచ్చితమైన చికిత్స ప్రస్తుతం అందుబాటులో లేదని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ఇలాంటి తరుణంలో ఆ వైరస్ లక్షణాలతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని పీపీఈ కిట్లు ధరించిన ప్రత్యేక బృందాలు ఖననం చేయాలని అంతర్జాతీయ వైద్య సంస్థలు ఇప్పటికే స్పష్టమైన సూచనలు జారీ చేశాయి. ఇప్పటివరకు భారత్‌లో ఎబోలా కేసులు ఏవీ నమోదు కాలేదని కేంద్రం స్పష్టం చేసింది. అయినా అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది.
