లారీ ఢీకొని ముగ్గురికి గాయాలు

గంగాస్నానం ముగించుకుని వస్తుండగా ప్రమాదం
ఇద్దరికి తీవ్ర గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
క్షతగాత్రులను కరీంనగర్‌ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలింపు

పాలకుర్తి, ఆగస్టు 15 (ఆంధ్రప్రభ): గంగాస్నానం ముగించుకుని ద్విచక్రవాహనంపై తిరిగి వస్తున్న ముగ్గురిని వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం శనివారం బసంత్‌నగర్‌లోని యూనివర్సల్‌ స్కూల్‌ ఎదురుగా చోటుచేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా శికురాయికి చెందిన పినగాసి సతీష్‌, స్వప్న, విక్కి గంగాస్నానం ముగించుకుని ఒకే ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో కరీంనగర్‌ వైపు వెళ్తున్న లారీ వారి ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాద ధాటికి ద్విచక్రవాహనం రోడ్డుపై పడిపోవడంతో ముగ్గురూ కిందపడిపోయారు.

ఈ ప్రమాదంలో సతీష్‌కు స్వల్ప గాయాలు కాగా, స్వప్న, విక్కికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే టోల్‌గేట్‌ అంబులెన్స్‌కు సమాచారం అందించగా, క్షతగాత్రులను కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన విక్కి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.