టెస్కో ఆర్డర్ల రద్దు చేనేత కార్మికులపై ప్రభావం

టెస్కో ఆర్డర్ల రద్దు చేనేత కార్మికులపై ప్రభావం

  • పునరాలోచించాలని ఐక్య వేదిక డిమాండ్

కరీమాబాద్, ఆంధ్రప్రభ ; ప్రభుత్వం ఏటా టెస్కో (తెలంగాణ చేనేత సహకార సంఘం)కు ఇచ్చే ఆర్డర్లను రద్దు చేయడం సమంజసం కాదని రాష్ట్ర చేనేత ఐక్య వేదిక మీడియా కార్యదర్శి లింగమూర్తి అన్నారు. ఈ మేరకు శుక్రవారం వరంగల్ జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. 2026 – 27 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు యూనిఫామ్ తయారీ కోసం టెస్కోకు ఇచ్చే రూ.105.54 కోట్ల ఆర్డర్ను రద్దు చేయడం అంటే చేనేత కార్మికుల ఉపాధిని దెబ్బ కొట్టడమే అని పేర్కొన్నారు.

వివిధ సంక్షేమ శాఖల నుంచి వచ్చే ఆర్డర్లను సైతం ఇవ్వకపోవడంతో చేనేత కార్మికులు ఆందోళన చెందుతున్నారన్నారు. దశాబ్దాలుగా విద్యాశాఖ, సంక్షేమ శాఖల పరిధిలోని విద్యార్థులకు దుస్తులు కుట్టిచ్చే బాధ్యతను చేనేత సహకార సంఘమే చూస్తుండగా ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చేనేత కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. ఏటా జనవరిలో వచ్చే ఆర్డర్ ఏప్రిల్ వచ్చినా రాకపోవడంతో కార్మికులు ఆదాయం కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

విద్యార్థులకు యూనిఫామ్ కుట్టే ఆర్డర్లను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. ఇప్పటికే రాష్ట్రంలోని 393 చేనేత సహకార సంఘాల్లో కార్మికులకు సరైన పని లేక ఆందోళన చెందుతుండగా, ప్రభుత్వం సైతం ఇచ్చే ఆర్డర్లను విరమించుకోవడం దారుణమని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి టెస్కోకు ఆర్డర్లు ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి వచ్చే ఆర్డర్లను చేనేత సంఘాలకు అప్పగించి వారి ఆర్థిక పురోగా అభివృద్ధికి సహకరించాలని కోరారు.