Illegal Immigrants Arrest | నిఘా సమాచారంతో పోలీసుల దాడులు
Illegal Immigrants Arrest | నిఘా సమాచారంతో పోలీసుల దాడులు
Illegal Immigrants Arrest | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : విశ్వసనీయ సమాచారం, నిఘా వర్గాల హెచ్చరికల ఆధారంగా జీడిమెట్ల పోలీసులు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. గజులరామారం–జీడిమెట్ల పరిధిలోని హెచ్ఏఎల్ ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో వీరు అక్రమంగా నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ తన బృందంతో కలిసి సోదాలు నిర్వహించగా, ఏడుగురు విదేశీయులు అక్కడ నివసిస్తున్నట్లు తేలింది. విచారణలో వారి వద్ద భారతదేశంలో నివసించేందుకు అవసరమైన చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్టులు, వీసాలు లేదా ఇతర ప్రయాణ పత్రాలు లేవని గుర్తించారు.
ప్రాథమిక దర్యాప్తులో వారు అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించి, దేశంలోని పలు ప్రాంతాల్లో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని తదుపరి చర్యలు ప్రారంభించారు. కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ, ఎన్. కోటి రెడ్డి, ఐపీఎస్ ఆదేశాల మేరకు సంబంధిత చట్టపరమైన నిర్బంధ, కదలికల నియంత్రణ ఉత్తర్వులు పొందిన పోలీసులు, వారిని మెదక్ జిల్లా జోగిపేటలోని డిపోర్టేషన్ సెంటర్‌కు తరలిస్తున్నారు. సంబంధిత అధికారుల ధృవీకరణ, ఇతర లాంఛనాలు పూర్తైన అనంతరం వారిని బంగ్లాదేశ్‌కు తరలించే ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో జీడిమెట్ల పోలీసులతో పాటు ఎస్‌ఓటీ కూకట్‌పల్లి జోన్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.
