Shashi Tharoor | దక్షిణాదికి అన్యాయం జరగనివ్వం…

Shashi Tharoor | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు చేపడితే దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా తీవ్రంగా నష్టపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ బిల్లులోని లోపాలను ఎత్తిచూపారు.

శశిథరూర్ చేసిన ప్రధాన వ్యాఖ్యలు ఇవే:

దక్షిణాదికి తీరని నష్టం: డీలిమిటేషన్ అమలు చేస్తే దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం అణచివేయబడుతుందని, ఇది దేశ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన హెచ్చరించారు.

హింది రాష్ట్రాలకే అగ్రపీఠం: ప్రస్తుతం ఉన్న బిల్లు కేవలం హిందీ మాట్లాడే రాష్ట్రాలకు అధిక ప్రయోజనం కలిగేలా ఉందని, ఇది ప్రాంతీయ అసమానతలకు దారితీస్తుందని విమర్శించారు.

సమాన హక్కులే ముఖ్యం: దేశంలోని అన్ని రాష్ట్రాలకు రాజకీయంగా సమాన హక్కులు, ప్రాధాన్యత ఉండాలని, జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు శిక్ష విధించడం సరికాదని పేర్కొన్నారు.

మహిళా బిల్లుకు జై.. డీలిమిటేషన్‌కు నై: మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని, అయితే దానిని డీలిమిటేషన్‌తో ముడిపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.

జేపీసీకి పంపాలి: ప్రస్తుత పరిస్థితుల్లో డీలిమిటేషన్ బిల్లును వెంటనే పక్కన పెట్టాలని, దీనిపై అఖిలపక్షం లేదా సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC)లో సమగ్రంగా చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు.

మహిళా సాధికారత పేరుతో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందన్న థరూర్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి.

Leave a Reply