సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. ఐకేపీ వీఓఏల నిరవధిక సమ్మె

కడెం, ఆంధ్రప్రభ: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రంలోని ఐకేపీ వీఓఏలు నిరవధిక సమ్మె ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత పద్ధతిలో సమ్మె చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఐకేపీ, సెర్ప్ వీఓఏల జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయించిన నేపథ్యంలో కడెం మండలంలో కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
కడెం మండల ఐకేపీ వీఓఏల ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో మంగళవారం వీఓఏలు నిరసన చేపట్టారు. అనంతరం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు అందజేశారు. ప్రభుత్వానికి తమ సమస్యలను నివేదించాలని కోరారు.
ఈ సందర్భంగా ఐకేపీ వీఓఏల యూనియన్ కడెం మండల అధ్యక్షుడు భూక్య విక్రమ్, మండల నాయకులు పి. లావణ్య, చేనేని రవి మాట్లాడుతూ పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు.
వీఓఏలకు నెలకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలని, తమను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్‌ఆర్ పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రూ.10 లక్షల ప్రమాద, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించి, అర్హులైన వీఓఏలకు సీసీలుగా పదోన్నతులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఐకేపీ వీఓఏలు పాల్గొన్నారు.
