రహదారి పక్కన చికెన్ వ్యర్థాలు.. దుర్గంధంతో ఇబ్బందులు

రహదారి పక్కన చికెన్ వ్యర్థాలు.. దుర్గంధంతో ఇబ్బందులు
దస్తూరాబాద్, ఆంధ్రప్రభ: మండల కేంద్రంలోని దస్తూరాబాద్–కలమడుగు ప్రధాన రహదారి పక్కన చికెన్ సెంటర్ల నిర్వాహకులు చికెన్ వ్యర్థాలను పడేస్తుండటంతో తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వ్యర్థాల నుంచి వెలువడుతున్న దుర్వాసన కారణంగా రహదారిపై ప్రయాణించే వాహనదారులు, పాదచారులు ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధాన రహదారి పక్కనే వ్యర్థాలను పారబోస్తుండటంతో పర్యావరణంతో పాటు ప్రజారోగ్యానికి కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
త్వరలో వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ వ్యర్థాల కారణంగా అంటువ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వారు పేర్కొంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను పడేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ఎంపీడీఓ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఈ పరిస్థితి ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
