సమస్యలు పరిష్కరించాలని సమ్మె..

కడెం, ఆంధ్రప్రభ : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని ఐకేపీ (ఇందిరా క్రాంతి పథం), సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ) వీఓఏలు సమ్మె బాట పట్టారు. ఈ నెల 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత పద్ధతిలో నిరవధిక సమ్మె చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఐకేపీ, సెర్ప్ వీఓఏల జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కడం మండల ఐకేపీ వీఓఏల ఆధ్వర్యంలో కడెం ఐకేపీ కార్యాలయం ఎదుట దీక్షా శిబిరం ఏర్పాటు చేసి సమ్మె నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఐకేపీ వీఓఏ ఎంప్లాయీస్ అసోసియేషన్ కడం మండల అధ్యక్షుడు బుక్య విక్రమ్, మండల నాయకులు పోతరాజుల లావణ్య, చేనేని రవి మాట్లాడుతూ వీఓఏలకు నెలకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే తమను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్‌ఆర్ పాలసీని అమలు చేయాలని కోరారు. అదనంగా రూ.10 లక్షల ప్రమాద, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఐకేపీ వీఓఏలు పాల్గొన్నారు.