మామిడి రైతులందరికీ సబ్సిడీ అందేలా క్షేత్రస్థాయి పరిశీలన

ప్రతి రైతు వివరాలు పరిశీలించి అర్హుల జాబితా సిద్ధం చేయాలి.. ఒక్క రైతు కూడా ప్రభుత్వ సాయానికి దూరం కాకూడదు :

జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : జిల్లాలో మామిడి పంట సాగు చేసిన ప్రతి రైతు వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హులైన రైతులందరికీ ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్ శాఖ అధికారులతో మామిడికాయల సేకరణ పురోగతి, సబ్సిడీ అమలు, అర్హులైన రైతుల గుర్తింపు తదితర అంశాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ మేరకు సూచనలు చేశారు.

ప్రభుత్వం అందించే సబ్సిడీ నిజమైన లబ్ధిదారులకు పారదర్శకంగా చేరేలా ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా పరిశీలించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందుకోసం మండల స్థాయిలో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బందితో సంయుక్త బృందాలను ఏర్పాటు చేసి గ్రామాల వారీగా మామిడి పంట సాగు చేసిన రైతులను గుర్తించాలని ఆదేశించారు.

మామిడి పంట నమోదులను ఈ-క్రాప్ వివరాలతో సరిపోల్చడంతో పాటు అవసరమైతే భౌతిక పరిశీలన కూడా నిర్వహించాలని సూచించారు. కేవలం ఈ-క్రాప్ నమోదుపైనే ఆధారపడకుండా, క్షేత్రస్థాయిలో పంట వాస్తవంగా ఉందో లేదో నిర్ధారించాలని తెలిపారు. ఈ-క్రాప్‌లో నమోదు లేకపోయినా భౌతికంగా మామిడి తోటలు ఉన్నట్లయితే నిబంధనల ప్రకారం ఈ-క్రాప్ నమోదు పూర్తి చేసి రైతులకు అర్హత కల్పించాలని, ఈ-క్రాప్‌లో నమోదు ఉండి క్షేత్రస్థాయిలో కూడా పంట ఉన్న రైతులను అర్హులుగా పరిగణించాలని ఆదేశించారు.

ఈ-క్రాప్‌లో రైతు పేరు నమోదై ఉండి రైతు మరణించిన సందర్భాల్లో కుటుంబ సభ్యులు పంటను విక్రయించి ఉంటే మరణ ధ్రువీకరణ పత్రం, రెవెన్యూ శాఖ ధ్రువీకరణ, ఆధార్ తదితర పత్రాలను పరిశీలించి నిబంధనల మేరకు సబ్సిడీ అర్హత నిర్ణయించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో మామిడి పంట సాగు చేసిన ఒక్క రైతు కూడా ప్రభుత్వ సహాయానికి దూరం కాకుండా ప్రతి కేసును నిష్పక్షపాతంగా పరిశీలించి అర్హులైన రైతులందరికీ సబ్సిడీ అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

అదే సమయంలో జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరించేందుకు రైతులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, రైతులకు అవసరమైన ఎరువులు ఎలాంటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళికతో అందుబాటులో ఉంచాలని సంబంధిత శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్, జిల్లా వ్యవసాయ అధికారి మురళి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సతీష్, మార్కెటింగ్ శాఖ అధికారి పరమేశ్వరన్, ఉద్యానవన శాఖ అధికారి కోటేశ్వరరావు తదితర అధికారులు పాల్గొన్నారు.