The Odyssey | ‘ది ఒడిస్సీ’పై భారీ అంచనాలు.. తెలుగు రాష్ట్రాల్లో హౌస్‌ఫుల్ ఓపెనింగ్స్

The Odyssey | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: హాలీవుడ్ స్టార్ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ది ఒడిస్సీ’ ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పుతోంది. విడుదలకు ముందే ఈ సినిమాపై అసాధారణ క్రేజ్ ఏర్పడగా, తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన వెంటనే పలు ప్రాంతాల్లో ఓపెనింగ్ షోలు బుక్ అయిపోయాయి. నోలన్ సినిమాల కోసం ఎదురుచూసే అభిమానులతో పాటు పురాణ, చారిత్రక కథలపై ఆసక్తి ఉన్న ప్రేక్షకులు కూడా ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రపంచ ప్రఖ్యాత గ్రీకు కవి హోమర్ రచించిన మహాకావ్యం ‘ఒడిస్సీ’ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ట్రోజన్ యుద్ధం ముగిసిన తర్వాత గ్రీకు రాజు ఒడిస్సియస్ తన రాజ్యం ఇథాకాకు తిరిగి చేరుకునేందుకు చేసిన సాహసయాత్ర, ఆయన జీవితంలో ఎదురైన అనేక సవాళ్లు, సముద్ర ప్రయాణాలు, కుటుంబం కోసం చేసిన పోరాటం ఈ చిత్రానికి ప్రధాన కథాంశం. ప్రపంచ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిన ఈ ఇతిహాసాన్ని క్రిస్టఫర్ నోలన్ తనదైన విజువల్ శైలిలో తెరపై ఆవిష్కరించబోతున్నారు.

ఈ చిత్రంలో ఒడిస్సియస్ పాత్రలో మ్యాట్ డామన్ నటిస్తుండగా, ఆయన భార్య పెనెలోప్ పాత్రలో అన్నె హత్‌వే కనిపించనున్నారు. అలాగే టామ్ హాలెండ్, రాబర్ట్ ప్యాటిన్సన్, జెండయా, సమంతా మార్టన్, చార్లీజ్ థెరాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రాన్ని ఎమ్మా థామస్, క్రిస్టఫర్ నోలన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సినిమాపై ఆసక్తిని మరింత పెంచేలా ప్రముఖ ఓటీటీ వేదిక జియోహాట్‌స్టార్ చిత్ర నిర్మాణానికి సంబంధించిన ప్రత్యేక మేకింగ్ వీడియోలను స్ట్రీమింగ్ చేయనుంది. ఇటీవల ముంబయిలో చిత్రబృందం సందడి చేయడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సోషల్ మీడియాలో ప్రచార కంటెంట్ వైరల్ అవుతుండటంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ రోజురోజుకూ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు విశేష స్పందన లభిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన కొద్దిసేపటికే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు తదితర నగరాల్లో ఓపెనింగ్ షోలు దాదాపు పూర్తిగా బుక్ అయ్యాయి. క్రిస్టఫర్ నోలన్ మరో విజువల్ ఎపిక్‌గా ‘ది ఒడిస్సీ’ నిలుస్తుందనే అంచనాలతో సినీ అభిమానులు ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.