వరుణుడి కరుణ కోసం మూగ బసవేశ్వరుడికి జలాభిషేకం

ఊట్కూర్ (ఆంధ్రప్రభ): నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని దంతాన్‌పల్లి శివారులో ఉన్న మూగ బసవేశ్వర స్వామి విగ్రహానికి అమావాస్య సందర్భంగా మంగళవారం రైతులు, గ్రామస్థులు ప్రత్యేక జలాభిషేకం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్‌లో పత్తి, కంది, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేసినప్పటికీ ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో రైతులు వరుణదేవుడి కరుణ కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గ్రామ సంప్రదాయం ప్రకారం డప్పు మేళతాళాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న రైతులు మూగ బసవేశ్వర స్వామికి జలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, రైతుల కష్టాలు తొలగాలని ప్రార్థించారు. ఇప్పటికే వర్షాభావం కారణంగా పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని, వెంటనే విస్తారంగా వర్షాలు కురవకపోతే భారీ నష్టాలు తప్పవని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.