అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు: ఎస్‌ఎఫ్‌ఐ

చేవెళ్ల (ఆంధ్రప్రభ): ఛలో సచివాలయం కార్యక్రమానికి వెళ్లకుండా తనను తెల్లవారుజామునే ముందస్తుగా అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరికి నిదర్శనమని ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి బేగరి అరుణ్‌కుమార్ విమర్శించారు. మంగళవారం ఛలో సచివాలయం కార్యక్రమానికి వెళ్లకుండా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ప్రజాస్వామ్య ఉద్యమాలను అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గమని అన్నారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ విద్యార్థి నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్బంధ రాజకీయాలను వీడి విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌ఈయూ డివిజన్ నాయకుడు జైపాల్, ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల డివిజన్ సహాయ కార్యదర్శి మణి గౌడ్, మండల కార్యదర్శి మాల చందు తదితరులు పాల్గొన్నారు.