ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి: బీజేపీ
హన్మకొండ జిల్లా స్థాయి ధర్నాకు సంఘీభావం
ఉమ్మడి వరంగల్ (ఆంధ్రప్రభ): తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) వరంగల్, హన్మకొండ జిల్లాల సంయుక్త ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం మంగళవారం హన్మకొండలో నిర్వహించిన జిల్లా స్థాయి ధర్నాకు బీజేపీ రాష్ట్ర నాయకురాలు రావు పద్మ, జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్‌రెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వోత్తం రెడ్డి హాజరై సంఘీభావం ప్రకటించారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ మద్దతు కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జీఓ నెం.190ను పూర్తిగా అమలు చేసి అర్హులైన ఉపాధ్యాయులకు వెంటనే బదిలీ ఉత్తర్వులు జారీ చేయాలని, ఇన్‌సర్వీస్ టీచర్ల ప్రత్యేక టెట్‌లో 40 శాతం మార్కులను అర్హతగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. అలాగే గురుకుల, గిరిజన, ఆశ్రమ, ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, జీఓ నెం.25ను సవరించి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ప్రతి ఏడాది ప్రమోషన్లు, బదిలీల షెడ్యూల్ విడుదల చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలకు జూన్ మొదటి వారంలోనే అన్ని రకాల గ్రాంట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీపీయూఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సంగెం శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాతినీ వెంకటరమణ, జిల్లా అధ్యక్షులు బాతినీ వీరస్వామి గౌడ్, ఉప్పుల సతీష్‌తో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
