ఎస్‌ఐఆర్‌ గడువును మూడు నెలలు పొడిగించాలి: సీపీఐ

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి వరంగల్ : ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) గడువును కనీసం మూడు నెలల పాటు పొడిగించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

మంగళవారం వరంగల్ శివనగర్‌లోని సీపీఐ జిల్లా కార్యాలయం తమ్మెర భవన్‌లో జిల్లా సహాయ కార్యదర్శి దండు లక్ష్మణ్ అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ దాదాపు 25 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో చేపడుతున్నప్పటికీ, దీనిపై ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ఓటర్లకు సరైన అవగాహన కల్పించడంలో ఎన్నికల సంఘం, అధికార యంత్రాంగం విఫలమైందని విమర్శించారు. బీఎల్‌వోలు పంపిణీ చేసిన ఫారాల్లో కేవలం 15 శాతం మాత్రమే తిరిగి సమర్పించబడినట్లు పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే లక్షలాది మంది అర్హులైన ఓటర్లు ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

2002 నాటి ఓటరు జాబితా వివరాలు, శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలు వంటి పాత రికార్డులను సమర్పించాల్సి రావడం వల్ల సాధారణ ప్రజలు, రోజువారీ కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాగే వలసలు, ఇళ్లకు తాళాలు ఉండటం, బీఎల్‌వోలకు తగిన శిక్షణ లేకపోవడం వల్ల ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని అన్నారు.

ప్రస్తుత జూలై 24 గడువును కనీసం మరో మూడు నెలలు పొడిగిస్తేనే ప్రతి అర్హుడికి ఓటు హక్కు లభిస్తుందని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎవరూ కోల్పోకుండా ప్రభుత్వం, ఎన్నికల అధికారులు వెంటనే ఎస్‌ఐఆర్‌ గడువును పొడిగించాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. విజయసారథి, జిల్లా కార్యదర్శి షేక్ బాష్‌మియా, రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్, జిల్లా నాయకులు సంగి ఎలేందర్, ఓర్సు రాజు, మహ్మద్ అక్బర్ పాషా, రాజేందర్, వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు.