ఫిషరీస్ కాలనీ పాఠశాలకు రూ.14 వేల విద్యాసామగ్రి పంపిణీ

వైరా, ఆంధ్రప్రభ: వైరా ఫిషరీస్ కాలనీ ప్రభుత్వ పాఠశాలకు హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓ అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్‌లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న సుందర్ నేతృత్వంలోని అప్నా పరివార్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రూ.14 వేల విలువైన విద్యాసామగ్రిని మంగళవారం పంపిణీ చేశారు. మండల విద్యాశాఖ అధికారి చావా శ్రీనివాసరావు, 7వ వార్డు కౌన్సిలర్ పణితి సైదులు, ఏఏపీసీ చైర్మన్ ఆది రజని విద్యార్థులకు విద్యాసామగ్రిని అందజేశారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెలిశెట్టి నరసింహారావు తన మిత్రులు, దాతల సహకారంతో పాఠశాలకు అవసరమైన మౌలిక వసతులు, విద్యా సామగ్రిని సమకూరుస్తూ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. సుందర్ దాతృత్వాన్ని అభినందిస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత మందికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.