డాక్టర్ మంద జంగిరెడ్డి సేవలు చిరస్మరణీయం

వైద్య వృత్తిలోనూ, సామాజిక సేవలోనూ చెరగని ముద్ర వేసిన మహనీయుడికి ఘన నివాళి

అచ్చంపేట, ఆంధ్రప్రభ: కీర్తిశేషులు డాక్టర్ మంద జంగిరెడ్డి 32వ వర్ధంతి సందర్భంగా అచ్చంపేట పబ్లిక్ క్లబ్ ఆవరణలో మంగళవారం ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో ఆయన కుమారుడు, అటవీశాఖ ఉద్యోగి మంద శ్రీనివాస్ రెడ్డి, పబ్లిక్ క్లబ్ అధ్యక్షుడు అంగిరేకుల బిక్షపతి, ఉపాధ్యక్షుడు కందికొండ శ్రీధర్, ప్రధాన కార్యదర్శి కానోజు మనోహర్ ప్రసాద్, పబ్లిక్ క్లబ్ మాజీ అధ్యక్షుడు, మాజీ అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్ను శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ పిల్లి హరిచంద్ర, మాజీ ఎంపీపీ రామనాథంతో పాటు క్లబ్ కార్యవర్గ సభ్యులు, గౌరవ సభ్యులు డాక్టర్ మంద జంగిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ డాక్టర్ మంద జంగిరెడ్డి పబ్లిక్ క్లబ్ అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో క్లబ్ అభివృద్ధికి, సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణకు విశేష కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన సేవాభావం, ప్రజల పట్ల అంకితభావం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.

అలాగే తాలూకా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, మహబూబ్‌నగర్ జిల్లా డాక్టర్స్ అసోసియేషన్ కార్యదర్శిగా పలు కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి వైద్య రంగానికి విశేష సేవలందించారని కొనియాడారు.

ఉప్పునుంతల మండలంలో వైద్యాధికారిగా విధులు నిర్వహించిన సమయంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించి జిల్లా స్థాయిలో గుర్తింపు పొందారని స్మరించుకున్నారు.

డాక్టర్ మంద జంగిరెడ్డి అందించిన సేవలు సమాజానికి చిరస్థాయిగా నిలిచిపోతాయని, ఆయన స్ఫూర్తితో ఆయన కుమారుడు మంద శ్రీనివాస్ రెడ్డి గత 32 సంవత్సరాలుగా తన తండ్రి పేరుతో పలు సేవా కార్యక్రమాలను కొనసాగించడం అభినందనీయమని సభలో పాల్గొన్నవారు పేర్కొన్నారు.

అనంతరం అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అలాగే పట్టణంలోని లెనిటి ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పబ్లిక్ క్లబ్ కార్యవర్గ సభ్యులు, గౌరవ సభ్యులు మందుల దశరథం, కేతేపల్లి వెంకటేష్, కాకునూరి రవి, కానుగుల శివ, బెళ్లి ఆంజనేయులు, ఎల్. కృష్ణ, బొప్పి అశోక్ నాథ్, రామనాథం, ఆకుల శ్రీను, జాఫర్, వైద్యులు డాక్టర్ రమాకాంత్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.