గేటు కష్టాలకు విముక్తి..

గుణదల ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం
గుణదల–నున్నా రాకపోకలకు గ్రీన్ సిగ్నల్
రూ.98.68 కోట్లతో రైల్వే ఓవర్‌బ్రిడ్జి
రేపు శంకుస్థాపన చేయనున్న ఎంపీ చిన్ని
భారతీయ రైల్వేల నిధులతో నిర్మాణం
920 మీటర్ల ఆధునిక ఆర్‌వోబీ ఏర్పాటు
వేలాది ప్రయాణికులకు భారీ ఊరట

శాశ్వత పరిష్కారం చూపిన ఎంపీ కేసినేని చిన్ని

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో: విజయవాడ–గుణదల రైల్వే సెక్షన్‌లోని అత్యంత రద్దీగా ఉండే లెవల్ క్రాసింగ్ నెం.316 స్థానంలో రూ.98.68 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అత్యాధునిక రోడ్ ఓవర్ బ్రిడ్జికి జూన్ 29, సోమవారం శంకుస్థాపన జరగనుంది. విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ (చిన్ని) ముఖ్య అతిథిగా హాజరై ఆర్‌వోబీకి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే గుణదల–నున్నా మార్గంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.

గంటల తరబడి నిరీక్షణ..

ప్రస్తుతం ఈ లెవల్ క్రాసింగ్ మీదుగా రోజుకు సుమారు 170 రైళ్లు (అప్, డౌన్ కలిపి) రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో గేటు రోజుకు 14 నుంచి 16 గంటలపాటు మూసివేయాల్సి వస్తోంది. ఫలితంగా వాహనదారులు ఒక్కోసారి 10 నుంచి 15 నిమిషాల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంటోంది. కొత్త ఓవర్‌బ్రిడ్జి అందుబాటులోకి వస్తే ఈ నిరీక్షణ సమయం దాదాపు ఒక నిమిషానికి తగ్గనుందని రైల్వే అధికారులు తెలిపారు.

ప్రాజెక్టు పట్టాలెక్కింది ఇలా..

ఈ ప్రాజెక్టుకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో పరిపాలనా అనుమతి లభించగా, 2026 మార్చి 30న పనుల కాంట్రాక్ట్ ఆమోద పత్రం జారీ చేశారు. మొత్తం 920 మీటర్ల పొడవుతో నిర్మించనున్న ఈ వంతెనలో 576 మీటర్ల వయాడక్ట్, 305 మీటర్ల రోడ్ ఫార్మేషన్, 126 మీటర్ల లెవల్ భాగం, 794 మీటర్ల స్లోప్ అప్రోచ్‌లు ఉంటాయి. మొత్తం 18 స్పాన్‌లు ఏర్పాటు చేయనున్నారు. వంతెనపై 7.5 మీటర్ల ప్రధాన రహదారి, రెండు వైపులా 5.5 మీటర్ల సర్వీస్ రోడ్లు, క్రాష్ బ్యారియర్లు, డ్రైనేజీ వ్యవస్థతో కలిపి మొత్తం 24 మీటర్ల వెడల్పు ఉండేలా రూపకల్పన చేశారు. రైల్వే ట్రాక్‌పై సుమారు 10 మీటర్ల ఎత్తులో వంతెన నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన భూమిలో 5.77 ఎకరాల ప్రభుత్వ భూమిని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగుతోంది. ప్రైవేట్ భూమి సేకరణ అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. పనులు ప్రారంభమైన తర్వాత 18 నెలల్లో పూర్తి చేయడం లక్ష్యంగా నిర్ణయించారు.

రాకపోకలకు సౌలభ్యం…

ఈ ఆర్‌వోబీ నిర్మాణంతో గుణదల, నున్నా, పరిసర ప్రాంతాల మధ్య రాకపోకలు మరింత వేగవంతం కానున్నాయి. రహదారి, రైల్వే ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ప్రయాణం సాగడంతో పాటు ప్రమాదాల ముప్పు గణనీయంగా తగ్గనుంది. వేలాది మంది రోజువారీ ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు ఈ వంతెన ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చనుంది. అలాగే విజయవాడ నగర ఉత్తర ప్రాంతాల పట్టణ విస్తరణ, పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలక మౌలిక సదుపాయంగా నిలవనుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. దశాబ్దాల కాలంగా ట్రాఫిక్ సమస్య ఎదుర్కొంటున్న ఆ ప్రాంత ప్రజలకు ఇది భారీ ఊరటగానే చెప్పవచ్చు. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించిన ఎంపీ కేసినేని చిన్నికి అన్ని వైపుల నుంచి అభినందనలు వస్తున్నాయి.