అన్నపూర్ణ నమోస్తుతే..

అన్నపూర్ణ నమోస్తుతే..
- ఇంద్రకీలాద్రిపై భక్తులకు అన్న ప్రసాదం
- రుచికర, శుభ్రమైన అన్నదానం
- నిత్యం వేలాది మందికి ప్రసాదం…
- రోజువారి మెనుపై ఈవో పర్యవేక్షణ..
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ; విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం లో నిర్వహిస్తున్న అన్నదాన పథకం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందంతో పాటు శ్రేష్ఠమైన భోజనానుభూతిని అందిస్తోంది.
ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని ఆస్వాదిస్తూ, ఆలయ సేవలను ప్రశంసిస్తున్నారు. అన్నపూర్ణ నమోస్తుతే, అన్నదాతా సుఖీభవ అనే సూత్రాన్ని ఆచరణలో నిలబెడుతూ, దేవస్థానం భక్తులకు అత్యుత్తమ సదుపాయాలను కల్పిస్తోంది.

ఆలయ ఈఓ, అధికారులు ప్రతిరోజూ అన్నదాన నాణ్యత, రుచి, మెనూ పై సమీక్ష నిర్వహిస్తూ, భక్తులకు పరిశుభ్రమైన, రుచికరమైన భోజనం అందించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. భోజన తయారీ నుంచి పంపిణీ వరకు ప్రతి దశలో శుభ్రత ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తున్నారు.

అన్నదానంలో ప్రతిరోజూ కొత్త రుచులతో కూడిన మెనూ అమలు చేస్తూ, భక్తుల అభిరుచులకు అనుగుణంగా వంటకాలను అందిస్తున్నారు. సాధారణ రోజుల్లో వేలాదిమందికి ప్రసాదం అందించగా, పండుగల సందర్భాల్లో లక్షలాది మంది భక్తులకు విస్తృతంగా అన్నదానం నిర్వహిస్తున్నారు. రుచికరత, పరిశుభ్రత, సమర్థ నిర్వహణతో దుర్గమ్మ అన్నదానం భక్తుల మనసులను గెలుచుకుంటూ, సేవామార్గంలో ఆదర్శంగా నిలుస్తోంది.
