చంద్రగిరిలో పసుపు పండుగ

చంద్రగిరిలో పసుపు పండుగ

తిరుపతి రూరల్‌లో మహానాడు వైభవం

డిజిటల్ విధానంలో మహానాడు నిర్వహణ..

మూడు కీలక ప్రతిపాదనలు చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని

తిరుపతి రూరల్, ఆంధ్రప్రభ : రూరల్ మండల పరిధిలోని తనపల్లి క్రాస్ సమీపంలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ వ్యవస్థాపకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

మహానాడుకు విచ్చేసిన కార్యకర్తలు, అభిమానులు, నాయకులను ఎమ్మెల్యే పులివర్తి నాని పేరుపేరునా ఆప్యాయంగా పలకరించారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో నిర్వహిస్తున్న డిజిటల్ మహానాడుకు భారీగా పార్టీ శ్రేణులు హాజరయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమానికి తన సతీమణి పులివర్తి సుధారెడ్డి, కుమారుడు వినీల్‌బాబుతో కలిసి హాజరైనట్లు చెప్పారు.

తెలుగు జాతి ప్రగతి, తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతి ఏడాది ఆత్మీయ వాతావరణంలో మహానాడు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తలకు అండగా నిలిచే పార్టీ, క్రమశిక్షణ, త్యాగం, సంస్థాగత బలం ప్రతిబింబమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మహానాడులో ఎమ్మెల్యే పులివర్తి నాని మూడు ప్రతిపాదనలు చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, వైసీపీ ప్రభుత్వ హయాంలో కూలిపోయిన వంతెనల నిర్మాణాన్ని పూర్తి చేయడం, ప్రతి నిరుపేద కుటుంబానికి ఎన్టీఆర్ గృహకల్ప పథకం కింద ఇల్లు నిర్మించాలని ప్రతిపాదించారు.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పార్టీ అధినేత ఆదేశాల మేరకు ఈ ఏడాది మహానాడును పొదుపు చర్యలతో డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రసారమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తదితర నాయకుల ప్రసంగాలను డిజిటల్ తెరల ద్వారా కార్యకర్తలు వీక్షించారు.

1982 మార్చి 29న నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో కూడా కొత్త శకానికి నాంది పలికిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. మహానాడు సభలు కేవలం పార్టీ నిర్ణయాలకే పరిమితం కాకుండా కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇచ్చే వేదికగా నిలుస్తున్నాయని అన్నారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండేళ్లలో సాధించిన విజయాలు, అమలు చేసిన హామీలు, తీసుకొచ్చిన పరిశ్రమలు, పెట్టుబడులు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ స్పూర్తితో ప్రారంభమైన మహానాడు నేటి యువతకు అభివృద్ధి రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తోందని పేర్కొన్నారు.

మహానాడుకు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply