young man | నగ్న ఫొటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్

young man | నగ్న ఫొటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్
young man | మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మానవత్వాన్ని మంటగలిపే ఘోర ఉదంతం వెలుగుచూసింది. ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా ఆ దృశ్యాలను రికార్డు చేసి ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో ప్రసారం చేస్తూ బెదిరింపులకు గురిచేస్తున్న నిందితుడిని మేడ్చల్ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన సాధనాల సంతోష్ కుమార్ 20 తండ్రి వెంకటేశ్వరావు),అనే యువకుడు ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా బాధితురాలిని నేరపూరితంగా బెదిరిస్తూ, అశ్లీల సామగ్రిని సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా ప్రసారం చేస్తూ వేధింపులకు గురిచేశాడు.
జవహర్‌నగర్ టు మేడ్చల్: ‘జీరో ఎఫ్ఐఆర్’ ద్వారా వేగవంతమైన చర్యలు
ఈ ఘాతుకంపై బాధితురాలు తొలుత ఈ నెల 28న జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటన జరిగిన ప్రాంతం (క్రైమ్ సీన్) మేడ్చల్ పరిధిలోకి రావడంతో, జవహర్‌నగర్ పోలీసులు తక్షణమే ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేశారు. అనంతరం మే 29న ఈ కేసును మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. కేసును స్వీకరించిన మేడ్చల్ పోలీసులు అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.
ముమ్మరంగా సాగుతున్న దర్యాప్తు.. కీలక ఆధారాల స్వాధీనం
కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు అత్యంత వేగంగా స్పందిస్తూ దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నారు.
మేడ్చల్ మహిళా సబ్ ఇన్స్పెక్టర్ (SI) స్వయంగా బాధితురాలి వద్దకు వెళ్లి, నిబంధనల ప్రకారం ఆమె పూర్తి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. బాధితురాలికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అక్కడ సేకరించిన కీలక నమూనాలను తదుపరి శాస్త్రీయ విశ్లేషణ కోసం హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL)కి పంపించారు.
బాధితురాలిని బెదిరించడానికి, వీడియోలు ప్రసారం చేయడానికి నిందితుడు ఉపయోగించిన కీలక ఆధారాలైన ‘OPPO’ మొబైల్ ఫోన్‌తో పాటు రెండు ట్యాబ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.మేడ్చల్ సీఐ. ఎ. సత్యనారాయణ ఈ కేసుకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (IO)గా వ్యవహరిస్తూ దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. నిందితుడు సాధనాల సంతోష్ కుమార్‌ను శనివారం అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయస్థానం అతనికి రిమాండ్ విధించింది. మహిళల రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.
