విద్యుత్ తీగలు తాకి మేక మృతి..
విద్యుత్ తీగలు తాకి మేక మృతి..
- జీవనాధారం కోల్పోయిన రైతు..
- నష్టపరిహారం ఇవ్వాలని గ్రామస్తుల డిమాండ్
వేల్పూర్, ఆంధ్రప్రభ : వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామానికి చెందిన రైతు జెల్లా అశోక్‌కు తీరని విషాదం ఎదురైంది. మేకలను మేపేందుకు జాగిర్యాల శివారు ప్రాంతానికి వెళ్లిన సమయంలో విద్యుత్ షాక్‌కు గురై ఓ మేక మృతి చెందింది.
వివరాల ప్రకారం, మేత మేస్తూ ముందుకు వెళ్లిన మేక నేలపై తెగిపడి ఉన్న విద్యుత్ తీగలను తాకింది. దీంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురైన మేక అక్కడికక్కడే మృతి చెందింది. కళ్లముందే మేక మృతి చెందడంతో రైతు అశోక్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.
ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ, “రోజూ కష్టపడి పెంచుకుంటున్న మేకే నా జీవనాధారం. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా నా మేక ప్రాణాలు కోల్పోయింది” అంటూ కన్నీరుమున్నీరయ్యాడు.
ఘటనపై స్పందించిన గ్రామస్తులు శివారు ప్రాంతాల్లో తెగిపడి ఉన్న విద్యుత్ తీగలను వెంటనే తొలగించి ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు. అలాగే బాధిత రైతుకు తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. తెగిపడిన విద్యుత్ తీగలను వెంటనే పునరుద్ధరించడంతో పాటు బాధిత రైతుకు నష్టపరిహారం మంజూరు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.
