రైల్లో గంజాయి రవాణా!
- రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి స్మగ్లింగ్
- 31.5 కిలోల గంజాయి పట్టివేత
- విలువ సుమారు రూ.63 వేలు
- ఈగిల్, జీఆర్‌పీ సంయుక్త తనిఖీలు
- ముగ్గురు అరెస్ట్.. పోలీసులు అదుపులో బాలుడు
- ఒడిశాలో కొనుగోలు చేసి బెంగళూరుకు తరలింపు
విజయవాడ, ఆంధ్రప్రభ: విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఈగిల్ టీమ్, ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లో అక్రమంగా తరలిస్తున్న 31.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా, ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.63 వేలుగా పోలీసులు అంచనా వేశారు.
రత్నాచల్ ఎక్స్ప్రెస్ లో రవాణా…
పోలీసుల కథనం ప్రకారం, విశాఖపట్నం నుంచి విజయవాడ వస్తున్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ గురువారం సాయంత్రం 7.20 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్‌లోని ఐదో ప్లాట్‌ఫారంపై ఆగిన సమయంలో ఈగిల్ టీమ్, జీఆర్‌పీ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను పరిశీలించగా వారి వద్ద ఉన్న నాలుగు లగేజీ బ్యాగుల్లో మొత్తం 21 ప్యాకెట్లలో 31.5 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు.
విచారణలో ప్రధాన నిందితుడు ఒడిశా రాష్ట్రంలోని జనతాబాయి గ్రామ పరిసర ప్రాంతాల్లోని గుర్తుతెలియని గిరిజనుల నుంచి కిలో రూ.2 వేల చొప్పున గంజాయిని కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం గంజాయిని కొనుగోలు చేసి కాకినాడ జిల్లా అన్నవరం సమీపంలో పొదల్లో దాచిపెట్టి, అనంతరం బెంగళూరులో ‘జోకి’ అనే వ్యక్తికి సరఫరా చేసేందుకు రవాణా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో తనపై నమోదైన మరో గంజాయి కేసు విచారణకు హాజరు కావాల్సి ఉండటంతో, గంజాయిని బెంగళూరుకు తరలించే బాధ్యతను ఇతరులకు అప్పగించినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. ఈ మేరకు కూలీలను ఏర్పాటు చేసి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఎన్‌డీపీఎస్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు జీఆర్‌పీ అధికారులు తెలిపారు.
