ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తుల ధర్నా
దస్తూరాబాద్ (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ: ట్రాక్టర్ డ్రైవర్‌పై ఫారెస్ట్ అధికారులు దాడి చేశారంటూ ఆరోపిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మున్యాల్ గ్రామస్తులు శుక్రవారం దస్తూరాబాద్–కలమడుగు–జగిత్యాల ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.
గ్రామస్తుల కథనం ప్రకారం.. మున్యాల్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ రాజ్‌కుమార్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పట్టా భూమి నుంచి ఇసుక తరలిస్తుండగా ఫారెస్ట్ అధికారులు అడ్డుకుని దాడి చేశారని ఆరోపించారు.
ఫారెస్ట్ సెక్షన్ అధికారి కింగ్ ఫిషర్ కులం పేరుతో దూషిస్తూ, బూటుతో తన్నారని బాధితులు ఆరోపించారు. సంబంధిత అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితుడికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై అధికారుల స్పందన తెలియాల్సి ఉంది.
