బడిబాటలో తాడ్వాయికి జిల్లా ప్రథమ స్థానం..

ఎంఈఓ రామస్వామికి కలెక్టర్ సన్మానం

తాడ్వాయి, ఆంధ్రప్రభ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమంలో అధిక విద్యార్థుల నమోదు సాధించి జిల్లా స్థాయిలో తొలి స్థానంలో నిలిచిన తాడ్వాయి మండలానికి గుర్తింపుగా మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) రామస్వామిని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఘనంగా సన్మానించారు.

అదేవిధంగా స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో జిల్లాలో మొదటి స్థానం సాధించిన ఎర్రపహాడ్ స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం సంగారెడ్డిని కూడా కలెక్టర్ అభినందించి శాలువాతో సత్కరించారు.

ఈ విద్యా సంవత్సరం (2026–27)లో గత ఏడాదితో పోలిస్తే 10 శాతం అదనపు విద్యార్థుల నమోదును లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమంలో తాడ్వాయి మండలంలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.

కామారెడ్డి కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంఈఓ రామస్వామి, ఎర్రపహాడ్ కాంప్లెక్స్ హెచ్‌ఎం సంగారెడ్డిని కలెక్టర్ శాలువాతో సత్కరించి అభినందించారు. ఇదే స్ఫూర్తితో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తూ, విద్యార్థుల నమోదు మరింత పెంచేందుకు కృషి చేయాలని సూచించారు.