గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే జీఎస్‌ఆర్

చిట్యాల, ఆంధ్రప్రభ: మారుమూల గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యమని, సీఎం రేవంత్ రెడ్డి గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (జీఎస్‌ఆర్) అన్నారు.

శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.2.26 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేశారు. చల్లగరిగలో శివాలయం సీసీ రోడ్డు, గుంటూరుపల్లిలో బొడ్రాయి సమీప సీసీ రోడ్డు, తిరుమలాపూర్‌లో అంగన్‌వాడీ భవనం, ఏలేటి రామయ్యపల్లిలో మెయిన్ రోడ్డు నుంచి స్మశానవాటిక వరకు సీసీ రోడ్డు, జడలపేట, బావుసింగ్‌పల్లి, నైన్‌పాక, అందుకుతండా, కాల్వపల్లి, ఒడితల గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సీసీ రోడ్ల నిర్మాణంతో దుమ్ము, ధూళి సమస్య తగ్గి ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని తెలిపారు.

అనంతరం నైన్‌పాక, నేరేడుపల్లి గ్రామాల మధ్య నిర్మాణంలో ఉన్న అసంపూర్తి వంతెన పనులను ఎమ్మెల్యే పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, తహసీల్దార్ వసంతరావు, ఎంపీడీవో జయశ్రీ, పంచాయతీరాజ్ డీఈ రవికుమార్, ఏఈ అరుణ, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.