దేశసేవే లక్ష్యం.. ఎన్‌సీసీ క్యాడెట్లకు లెఫ్టినెంట్ కల్నల్ పిలుపు

జానకంపేట్‌లో ఎన్‌సీసీ వార్షిక శిక్షణ శిబిరం ముగింపు

ఎడపల్లి, ఆంధ్రప్రభ: జానకంపేట్‌లోని సీటీసీ కేంద్రంలో నిర్వహించిన క్యాట్–IV ఎన్‌సీసీ వార్షిక శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో క్యాడెట్ల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

జూలై 1 నుంచి 10 వరకు నిర్వహించిన ఈ శిబిరంలో ఐడీఎస్‌ఎస్‌సీ, టీఎస్‌సీతో పాటు ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన 525 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. వీరిని ఆల్ఫా, బ్రావో, చార్లీ, డెల్టా కంపెనీలుగా విభజించి వెపన్ ట్రైనింగ్, డ్రిల్, ఎఫ్‌సీబీసీ, మ్యాప్ రీడింగ్ తదితర అంశాల్లో శిక్షణ అందించారు. అలాగే క్రీడా పోటీలు కూడా నిర్వహించారు.

ఈ సందర్భంగా క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ విష్ణు ప్రసాద్ నాయర్ మాట్లాడుతూ.. శిబిరంలో నేర్చుకున్న అంశాలతో ఏ, బీ, సీ సర్టిఫికెట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, వాటి ద్వారా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని క్యాడెట్లకు సూచించారు. దేశానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన క్యాడెట్లకు పతకాలు అందజేసి సత్కరించారు.