టూరిజంపై దుష్ప్రచారం చేస్తున్న గొడ్డలి పార్టీ.

24 నెలల్లో రూ.19,400 కోట్ల పెట్టుబడులు..
91,960 ఉద్యోగాలకు శ్రీకారం
బీచ్ షాక్స్ నుంచి టెంట్ సిటీల వరకు భారీ ప్రణాళికలు
జగన్ పాలనలో పర్యాటక రంగం నిర్వీర్యం
దేశంలోనే అగ్రగామి పర్యాటక రాష్ట్రంగా ఏపీ
టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ

విజయవాడ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంపై వైసీపీ (గొడ్డలి పార్టీ) ఉద్దేశపూర్వకంగా విష ప్రచారం చేస్తోందని, వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు నూకసాని బాలాజీ విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర పర్యాటక రంగం వేగంగా పురోగమిస్తోందని, గత ప్రభుత్వ విధ్వంసకర పాలన నుంచి బయటపడి అభివృద్ధి దిశగా పయనిస్తోందని పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందన్నారు. పర్యాటకుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బీచ్ షాక్స్ పాలసీని తీసుకొచ్చామని, దీనిపై కూడా ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.

విశాఖపట్నం, సూర్యాలంక బీచ్ ప్రాంతాల్లో బీచ్ షాక్స్ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. పర్యాటక రంగంలో కేవలం 24 నెలల్లోనే రూ.19,400 కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని బాలాజీ వెల్లడించారు. ఈ పెట్టుబడుల ద్వారా 91,960 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. ఇప్పటికే 65 ప్రాజెక్టులకు డీపీఆర్‌లు సిద్ధమవగా, వాటిలో 18 ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసి రూ.4,376 కోట్ల పెట్టుబడులతో పనులు ప్రారంభించినట్లు చెప్పారు.

రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాల్లో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ఫెస్టివల్ టూరిజానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన తెలిపారు. వైజాగ్, అరకు, అనకాపల్లి ప్రాంతాల్లో 11 రోజులపాటు పర్యాటక ఉత్సవాలు నిర్వహించామని, అమరావతిలో నిర్వహించిన అవకాయ ఫెస్టివల్‌కు విశేష స్పందన లభించిందన్నారు. నూతన టూరిజం పాలసీ 2024–2029 ద్వారా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని, 21 రోజుల్లోనే పరిపాలనా అనుమతులు జారీ చేసే విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ.441 కోట్లతో పలు పర్యాటక ప్రాజెక్టులు చేపడుతున్నామని, గండికోట, అన్నవరం, సింహాచలం టెంపుల్, బొర్రా కేవ్స్ తదితర ప్రాంతాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు.

హోటల్ రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం 50 వేల గదుల లక్ష్యంతో ముందుకు సాగుతోందని, ప్రస్తుతం 9,042 గదులు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. అరకు, గండికోట సహా ఆరు ప్రాంతాల్లో టెంట్ సిటీల ఏర్పాటు, 10 ప్రాంతాల్లో రోప్‌వే ప్రాజెక్టుల కోసం చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అలాగే కొండపల్లి, మంగళగిరి, కూచిపూడి, కడియం, చీరాల, బాపట్ల, అరకు తదితర ప్రాంతాల్లో అనుభూతి కేంద్రాల (ఎక్స్‌పీరియన్స్ సెంటర్స్) ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు.

గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన బాలాజీ, ఆ పాలనలో పర్యాటక రంగం పూర్తిగా కుదేలైందన్నారు. పర్యాటక కేంద్రాల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పన వంటి అంశాల్లో ఎలాంటి పురోగతి సాధించలేదని ఆరోపించారు. రుషికొండ పర్యాటక కేంద్రాన్ని ధ్వంసం చేసి ప్రజాధనాన్ని వృథా చేశారని, పర్యాటక రంగానికి రావాల్సిన పెట్టుబడులు నిలిచిపోయే పరిస్థితి నెలకొన్నదని విమర్శించారు. ప్రజల తీర్పుకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని, ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామి పర్యాటక రాష్ట్రంగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని నూకసాని బాలాజీ స్పష్టం చేశారు.