107 రోజుల దీక్ష.. అయినా కరగని ప్రభుత్వం!
- జీవో 98 బాధితులను విస్మరిస్తున్న ప్రభుత్వం
- చంద్రబాబు నుంచి జగన్ వరకు, ఇప్పుడు లోకేష్ కూడా..
- ముంపు నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వాలు
- 674 కుటుంబాలకు న్యాయం చేయలి
- ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాల హామీ నీటిమూటేనా?
- బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్
నందికొట్కూరు, ఆంధ్రప్రభ: శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో సర్వస్వం కోల్పోయిన జీవో 98 బాధితుల్లో అర్హులైన 674 మందిని నీటిపారుదల శాఖలో లస్కర్లుగా నియమించాలని డిమాండ్ చేస్తూ నందికొట్కూరు పట్టణంలో 107 రోజులుగా దీక్షలు చేస్తున్న వారిని శుక్రవారం బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ సందర్శించి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాదాపు 40 ఏళ్లుగా జీవో 98 కింద అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ, నారా చంద్రబాబు నాయుడు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో శ్రీశైలం ముంపు నిర్వాసిత నిరుద్యోగులు అనేక రూపాల్లో ఆందోళనలు చేసినా, ఎన్నికల ముందు ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇవ్వడం తప్ప వాటిని అమలు చేయలేదని విమర్శించారు.
ప్రస్తుత రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా, నందికొట్కూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీశైలం ముంపు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీని నమ్మి ప్రజలు టీడీపీ అభ్యర్థిని గెలిపించారని అన్నారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు జారీ చేసిన జీవో 98ను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మంత్రి నారా లోకేష్ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నారని, 674 మంది ముంపు నిరుద్యోగులకు న్యాయం చేయలేని ప్రభుత్వం ఆ హామీని ఎలా నెరవేరుస్తుందో ప్రజలకు విశ్వాసం లేదని ఎద్దేవా చేశారు. వెంటనే 674 మంది ముంపు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
దీక్షా శిబిరంలో నేలపై కూర్చొని ఆయన నిరసనకు సంఘీభావం తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన 32 మంది ముంపు నిరుద్యోగుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.3.20 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
అనంతరం దీక్షా శిబిరం నుంచి ర్యాలీగా బయలుదేరి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు రఘురామమూర్తి, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు, పీడీఎస్యూ నాయకులు శేఖర్ నాయుడు, జిల్లా బీసీ సంఘం నాయకులు శేషుపాణి, వాల్మీకి సంఘం నాయకులు పి. లింగాపురం రమణ, రాముడు, శ్రీశైలం నీటి ముంపు నిరుద్యోగ సంఘం నాయకులు జయన్న, నారాయణరెడ్డి, గణపురం వెంకటసుబ్బయ్య, దాసరి రాజారావు, రమణ, జమ్మన్న, శైలజ, అయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.
