TTD | అన్నప్రసాదాల్లో అదనంగా ‘వడ’ ప్రసాదంను పంపిణీ చేసిన టీటీడీ ఛైర్మన్

తిరుమల : తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో గురువారం టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరిలతో కలిసి టీటీడీ ఛైర్మన్ భక్తులకు వడ వడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ… తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్న ప్రసాదం మెనూలో భక్తులకు అదనంగా ఒక పదార్థం వడ్డించాలని ఆలోచన కలిగిందన్నారు. ఈ విషయాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా ఆయన అంగీకారంతో వడల వడ్డింపు కార్యక్రమాన్ని ఈరోజు నుండి ప్రారంభించామన్నారు.

ఇప్పటికే భక్తులకు నాణ్యమైన దినుసులతో భక్తులకు రుచికరమైన అన్న ప్రసాదాలు అందిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు తెలియజేశారు. భక్తులకు పంపిణీ చేసే వడ తయారీలో శెనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పొదీన, సోంపును ఉపయోగించనున్నారు. అన్నప్రసాద కేంద్రంలో ఇకపై ప్రతిరోజూ ఉదయం 10.30గంటల నుండి సాయంత్రం 04 గంటల వరకు 35వేల వడలను భక్తులకు వడ్డించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింతగా పెంచి భక్తులకు రుచికరమైన భోజనం అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతారామ్, డిప్యూటీ ఈవోలు లోకనాథం, రాజేంద్ర, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *