Future City TG | ట్రిలియన్ డాలర్ల ఎకానమీ : సీఎం రేవంత్‌

ఫ్యూచర్ సిటీతో చైనాకు పోటీ..
ఫ్యూచర్ సిటీతో తెలంగాణకు గ్లోబల్ గుర్తింపు
‘క్యూర్, ప్యూర్, రేర్’ విజన్‌తో రేవంత్ సర్కార్ దూకుడు
హైదరాబాద్‌ను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం..
ఫార్మా, టెక్నాలజీ, అగ్రికల్చర్ రంగాల్లో భారీ ప్రణాళికలు..
కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు ఈవీలకు ప్రాధాన్యం

Future City TG | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిచే రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ సమీపంలో అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కీలక కేంద్రంగా మారనుందని చెప్పారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ఆధునిక సాంకేతికత, పెట్టుబడులను ఆకర్షించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు.

చైనాతో పోటీ పడే స్థాయిలో అభివృద్ధి వ్యూహాలు రూపొందిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను కొత్త స్థాయికి తీసుకెళ్లడంతో పాటు.. తెలంగాణ అభివృద్ధికి ‘క్యూర్, ప్యూర్, రేర్’ (Cure, Pure, Rare) అనే మూడు ప్రధాన సూత్రాలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

అమెజాన్ డేటా సెంటర్‌తో పెట్టుబడులకు ఊతం

ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగంగా ఇటీవల అమెజాన్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇది తెలంగాణలోకి మరిన్ని అంతర్జాతీయ పెట్టుబడులు రావడానికి మార్గం సుగమం చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌కు భారీ స్పందన లభించిందని, దాదాపు 3 వేల కార్పొరేట్ సంస్థలు పాల్గొన్నాయని చెప్పారు.

తెలంగాణను అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

హైదరాబాద్‌ను గ్లోబల్ ఫార్మా హబ్‌గా తీర్చిదిద్దుతాం

హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి ఫార్మా కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి స్పష్టమైన విధానాలు అవసరమనే ఉద్దేశంతో ఇప్పటికే టూరిజం, మెడికల్, స్పోర్ట్స్ రంగాల్లో కొత్త పాలసీలను తీసుకొచ్చామని వెల్లడించారు.

హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలో ప్రస్తుతం కోటి 34 లక్షల మంది జనాభా ఉన్న నేపథ్యంలో.. ఈ ప్రాంతాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. మూసీ నది ప్రక్షాళనతో పాటు మెట్రో రైలు విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

ఈవీల వైపు హైదరాబాద్ అడుగులు

పర్యావరణ పరిరక్షణలో భాగంగా పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తామని సీఎం తెలిపారు. హైదరాబాద్‌లోని సుమారు 2 లక్షల డీజిల్ ఆటోలను ఈవీ ఆటోలుగా మార్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఈవీ వాహనాల కొనుగోలుపై జీరో ట్యాక్స్ విధిస్తున్నామని వెల్లడించారు. దీని వల్ల ప్రభుత్వ ఆదాయానికి కొంత నష్టం వచ్చినా.. నగర భవిష్యత్తు, ప్రజల ఆరోగ్యం కోసం ఈ నిర్ణయాన్ని కొనసాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.