సహకార రంగానికి ఎన్టీఆర్ దిశానిర్దేశం చిరస్మరణీయం

సహకార రంగానికి ఎన్టీఆర్ దిశానిర్దేశం చిరస్మరణీయం

విజయవాడ, ఆంధ్రప్రభ : తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీకగా, సహకార రంగానికి దిశానిర్దేశం చేసిన మహానేత స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు గురువారం విజయవాడ మిల్క్ ఫ్యాక్టరీ ఆవరణలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ సేవలను స్మరించుకుంటూ నాయకులు, అధికారులు ఆయన దూరదృష్టిని కొనియాడారు.
ఈ సందర్భంగా చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ, మ్యాక్స్ చట్ట రూపకర్తగా ఎన్టీఆర్ సహకార రంగ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. రైతులకు స్వయం ప్రతిపత్తి కల్పించి, వారి ఉత్పత్తులకు వారే ధర నిర్ణయించుకునే హక్కు కలగాలన్నది ఆయన ఆశయమని తెలిపారు.
ఆ ఆలోచనలే నేడు సహకార వ్యవస్థను దేశంలోనే ఆదర్శవంతమైన స్థాయికి తీసుకువచ్చాయని ఆయన అన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ ప్రస్తుతం దేశంలోనే అత్యధిక పాల సేకరణ ధర చెల్లిస్తున్న సహకార సంస్థగా నిలవడం ఎన్టీఆర్ విధానాల ఫలితమేనని స్పష్టం చేశారు.
పాడి రైతులకు క్రమం తప్పకుండా ధర వ్యత్యాసం చెల్లించడం, పశు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం, రైతుల ఆర్థిక స్వావలంబన కోసం నిరంతరం కృషి చేయడం సంస్థ లక్ష్యమని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో సహకార రంగం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కృష్ణా మిల్క్ యూనియన్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వర బాబు, సమితి అధికారులు, సిబ్బంది, పాడి రైతులు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మిల్క్ ఫ్యాక్టరీ ఆవరణను ప్రత్యేకంగా అలంకరించి స్మారక కార్యక్రమాలు నిర్వహించారు.
