మరణించిన వ్యక్తి కూతురి వివాహానికి..

మరణించిన వ్యక్తి కూతురి వివాహానికి..
నంద్యాల బ్యూరో అక్టోబర్ 12 ఆంధ్రప్రభ : స్నేహమంటే మట్టి కాదోయ్… స్నేహమంటే మనుషులోయ్… అన్న ఓ కవి నినాదాన్ని ఆ స్నేహితులు నిజం చేసి చూపించారు. తండ్రి మరణంతో ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నపేద కుటుంబానికి మేమున్నామంటూ తోడుగా నిలిచారు.. బాల్య మిత్రులు. మరణించిన స్నేహితుడి కుమార్తె వివాహానికి ఆర్థికసాయం అందించి పెళ్లి పెద్దలయ్యారు. వివరాలు.. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం నల్లవాగుపల్లె గ్రామానికి చెందిన శివకుమార్ రెడ్డి, ప్రభాకర్, చంద్రలాల్,శ్రీధర్, మృత్యుంజయ, రఘువీర్, రాధాకృష్ణ తదితరులు 1982-83 వ సంవత్సరంలో నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ విద్యాలయంలో అందరూ కలిసి పదో తరగతి చదివారు.
ఆ స్నేహితుల్లో ప్రభాకర్ 2007 వ సంవత్సరంలో అనారోగ్యంతో మరణించారు. ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న పదో తరగతి చదివిన మిత్రులు అండగా నిలిచారు. ప్రభాకర్ పెద్ద కుమార్తె లక్ష్మీదేవికి ఆళ్లగడ్డ మండలం రామతీర్థం క్షేత్రంలో మిత్రులు ఘనంగా పెళ్లి జరిపించారు. బంధువులు ఉన్నప్పటికీ స్నేహితులే పెళ్లికూతురు పల్లకి మోసి అందరినీ ఆకట్టుకున్నారు. తండ్రి మరణించినప్పటికీ అతని స్నేహితులు పెళ్లి కూతురు పల్లకి మోసి పెద్దలుగా నిలిచారు. తమకు అండగా నిలిచినందుకు ఆ పెళ్లికూతురు తండ్రి స్నేహితులకు కృతజ్ఞతలు తెలపటం విశేషం.
