రూ.75 లక్షల వ్యయంతో ఆధునిక ఫైర్ వాహనం ప్రారంభం..

రూ.75 లక్షల వ్యయంతో ఆధునిక ఫైర్ వాహనం ప్రారంభం..

ధర్మవరం, ఆంధ్రప్రభ : ధర్మవరం పట్టణ ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ధర్మవరం అగ్నిమాపక కేంద్రానికి రూ.75 లక్షల వ్యయంతో అత్యాధునిక ఫైర్ ఇంజిన్‌ను మంజూరు చేయగా, రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ బుధవారం ఘనంగా ప్రారంభించారు.


ఈ ఆధునిక ఫైర్ వాహనంలో 5,000 లీటర్ల సామర్థ్యం గల నీటి ట్యాంకు, శక్తివంతమైన మోటార్, అత్యాధునిక అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయబడ్డాయి. అగ్నిప్రమాదాల సమయంలో వేగంగా స్పందించి ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడంలో ఈ వాహనం కీలక పాత్ర పోషించనుందని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా పాత ఫైర్ ఇంజన్లతోనే అగ్నిమాపక సిబ్బంది కష్టసాధ్య పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. వారి డిమాండ్‌కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల ద్వారా ఈ ఆధునిక ఫైర్ వాటర్ టెండర్‌ను మంజూరు చేసినట్లు వెల్లడించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో సరైన సౌకర్యాలు లేకపోయినా అగ్నిమాపక సిబ్బంది ధైర్యసాహసాలతో విధులు నిర్వర్తించి, ధర్మవరంలో జరిగిన 62 అగ్నిప్రమాదాలను అదుపులోకి తెచ్చారని తెలిపారు.

ఈ చర్యల ద్వారా దాదాపు రూ.4.60 కోట్ల ఆస్తి నష్టం తప్పించగలిగినట్లు పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే ముఖ్య లక్ష్యంగా తీసుకుని పనిచేయాలని మంత్రి సిబ్బందికి సూచించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా వెంటనే స్పందించి నష్టాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అలాగే అగ్నిప్రమాదాల నివారణలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సమాచారం అందించేందుకు 08559-220626, 9963740213 లేదా టోల్ ఫ్రీ నంబర్ 101కు కాల్ చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫైర్ అధికారి మాధవ నాయుడు, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.