ఆసిఫ్ నగర్లో అగ్ని ప్రమాదం..
ఆసిఫ్ నగర్లో అగ్ని ప్రమాదం..
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలోని ఆసిఫ్ నగర్ ప్రాంతంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హుడా కాలనీ పరిసరాల్లో ఉన్న ఫర్నిచర్ గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కొద్దిసేపట్లోనే మంటలు భారీగా వ్యాపించి గోదాం మొత్తాన్ని ఆవరించాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. ఫైర్ టెండర్లు సంఘటన స్థలానికి చేరుకుని నీటితో మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యాయి. పరిసర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి అక్కడి నుంచి దూరంగా తరలించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. అయితే.. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని స్థానికులు చెబుతున్నారు. కానీ గోదాంలో ఉన్న ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమై భారీ ఆస్తి నష్టం సంభవించింది. ఇదిలా ఉండగా, ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో కూడా ఇటీవల బైక్కు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైన ఘటన కలకలం రేపింది. వరుస అగ్నిప్రమాదాలతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
