జూబ్లీహిల్స్ అభ్య‌ర్థి మ‌ద్ద‌తుపై నిర్ణ‌యం వెల్ల‌డి..

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో కూట‌మి అభ్య‌ర్థికే మ‌ద్ద‌తు ఇస్తామ‌ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి ఎన్‌.చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించారు. చంద్ర‌బాబు నిర్ణ‌యంతో తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి బ‌ల‌ప‌ర్చిన కాంగ్రెస్ అభ్య‌ర్థికి గానీ, దివంగ‌త నేత మాగంటి గోపీనాధ్ భార్య బీఆర్ఎస్ అభ్య‌ర్థి సునీత‌కు మ‌ద్ద‌తు ఇస్తార‌న్న ప్ర‌చారానికి తెర‌దించిన‌ట్ల‌యింది.

ఈ రోజు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తిలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ తెలుగుదేశం నేతలతో ఆయ‌న‌ సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో అనుసరించాల్సిన విధానంపై చర్చించారు. కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థి అంటే బీజేపీ అభ్య‌ర్థి గెలుపు కోసం కృషి చేయాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు.

రేప‌టికి బీజేపీ అభ్య‌ర్థి వెల్ల‌డి

జూబ్లీహిల్స్ బీజేపీ అభ్య‌ర్థి కోసం రూపొందించిన జాబితాను అధిష్ఠానానికి తెలంగాణ‌ పార్టీ అధ్య‌క్షుడు రామ్‌చంద‌ర్ రావు పంపించార‌ని స‌మాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి సుమారు 40 మంది ముందుకు రాగా, 25 మంది జాబితాను అధిష్ఠానానికి పంపించార‌ని తెలిసింది. 24 గంట‌ల్లో బీజేపీ అభ్య‌ర్థి పేరు వెల్ల‌డిస్తార‌ని స‌మాచారం.

ఊహాగానాల‌కు తెర‌దించిన బాబు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల విష‌యంలో ఊహాగానాల‌కు తెలుగుదేశం అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు తెర‌దించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తొలుత తెలుగుదేశం నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. మాగంటి గోపినాథ్ భార్య సునీత బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్నారు.

మాగంటి గోపినాథ్ కుటుంబంతో చంద్ర‌బాబు నాయుడు కుటుంబానికి స‌న్నిహిత సంబంధం ఉంది. తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కూడా అనేక ఏళ్లు తెలుగుదేశంలో కొన‌సాగారు. చంద్ర‌బాబు నాయుడు స‌న్నిహితులు కూడా. ఈ ఎన్నిక‌ల్లో రేవంత్ రెడ్డి బ‌ల‌ప‌రిచిన కాంగ్రెస్ అభ్య‌ర్థికి గానీ, బీఆర్ఎస్ అభ్య‌ర్థి మాగంటి సునీత‌కు గానీ మ‌ద్ద‌తు ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. చంద్ర‌బాబునాయుడు ప్ర‌క‌ట‌న‌తో ప్ర‌చారానికి తెర‌ప‌డింది.

Leave a Reply