ధాన్యం సేకరణ సమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలన..

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్‌గల్ మండలం పిప్రి (జె) గ్రామం కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న ధాన్యం సేకరణ సమస్యలపై ఆయన నేరుగా క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి, వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుండే డి.ఎస్.ఓ (డీఎస్ వో) తో ఫోన్ లో మాట్లాడి తక్షణ పరిష్కార మార్గాలను సూచించారు. ఏప్రిల్ 2వ తేదీన వచ్చిన ధాన్యం కుప్పలు కూడా ఇంకా కొనుగోలు కేంద్రాల్లోనే ఉండటంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
గత 15 రోజులు, నెల రోజులుగా ధాన్యం కుప్పలు అలాగే ఉన్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పిప్రి (జె), పరిసర ప్రాంతాల్లో సుమారు 60 నుండి 80 లారీల ధాన్యం నిల్వ ఉందని, వెంటనే అదనపు లారీలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని డి.ఎస్.ఓ ను ఆదేశించారు. లారీలు రాకపోవడం వల్ల రైతులు అదనంగా బస్తాకు 5 నుండి 7 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రైస్ మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని ఎమ్మెల్యే సూచించారు. ముకుంద రైస్ మిల్లు వంటి చోట్ల తరుగు విషయంలో 42 కిలోలకే ఒప్పించేలా చూడాలని అధికారులను కోరారు.తాను ఇవాళ నియోజకవర్గానికి ఉత్తర సరిహద్దున ఉన్న దూద్‌గాం నుండి దక్షిణ సరిహద్దున ఉన్న పిప్రి వరకు అన్ని ప్రాంతాలను పర్య వేక్షించానని,రైతుల సమస్యల పరిష్కారమే తన ప్రథమ ప్రాధాన్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.రైతుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలుపుతూ, వీలైనంత త్వరగా ధాన్యం సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు కోరారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
